Tuesday, November 5, 2024

ప్రజా మార్పు కోసమే మహాజన సంపర్క్ అభియాన్

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : గడిచిన 9 ఏళ్ల బిజెపి సుదీర్ఘ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం దిన దినాభివృద్ధ్ది చెందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరిట కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్ పాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రజలలో మార్పుతో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేందుకే గ్రామ గ్రామాన మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టి నిర్వహిస్తుందని భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీపురం నారాయణ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్, రాజారా గ్రామాలలో గురువారం మండలం బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, పలువురు బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన మొదలైన నాటి నుండి తన నియంతృత్వ పాలనతో బంగారు తెలంగాణను అప్పుల ఆత్మహత్య తెలంగాణగా మార్చేశారని దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కనీసం ఏక కాలంలో రుణమాఫీ, 24 గంటల నిరంతర విద్యుత్, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీ గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు సరైన భోజనం, మౌలిక వసతులను అందించడం గులాబీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొడుకు కెటిఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావులకు వందల ఎకరాల ఫామ్‌హౌస్‌ల నిర్మాణం, ఎమ్మెల్యేలు వారి అనుచరులు చేసే భూకబ్జాలు, స్కాంలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వ భూములను ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రం ప్రభుత్వం అందించే పథకాలన్నింటిలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని ముఖ్యంగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధితో యూరియా, పొటాష్, తదితర ఎరువులను కొన్ని వేల సబ్సిడీలతో రైతులకు అందిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చడమే కాకుండా వాస్తవాలను ప్రజలకు తెలియనీయకుండా చేస్తుందని అన్నారు. అంతేగాకుండా మహిళల ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ మరుగుదొడ్లు బాలింతల కిట్లు, వైకుంఠధామం సిసి రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు రైతు వేదికలు, లాంటి అభివృద్ధ్ది పనులకు కేంద్ర ప్రభుత్వమే నిధులను కేటాయిస్తుందని తెలిపారు.

అంతటి కరోనా విపత్కర సమయంలో 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ బియ్యం అందించిన ఘనత మోడీ ప్రభుత్వానిదని రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని వేల కోట్ల ఖర్చుతో పున: ప్రారంభించడం జరిగిందని, ముథోల్ నియోజకవర్గంలో స్థానిక సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్రామపంచాయతీ నిధులు, ఉపాధిహమీ నిధులు, పల్లెప్రకృతి వనాలు, ప్రధాన మంత్రి రోడ్లు, ఆవాస్ యోజన ఆయుష్మాన్ భారత్, తదితర విషయాలపై అవగాహన కల్పించారు.

ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలని నిజా నిజాలు తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో ఏకాభిప్రాయ ఓటు తీర్పుతో బిజెపి పార్టీకి పట్టం కట్టాలని బిఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ముథోల్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్, మండల అధ్యక్షులు సంటెన్నోల్ల గంగాధర్, పోలింగ్ బూత్ అధ్యక్షుడు కైరి మహేష్ గౌడ్, ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సాయినాథ్ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News