హైదరాబాద్: మేడారం జాతరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ఆర్టీసి అధికారులు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాణికుల కోసం టిఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అదే సమయంలో మేడారం జాతరకు ఆర్టీసి బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, మేడారం జాతరకు టిఎస్ ఆర్టీసి 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్‌లను ఆర్టీసి ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాల నుంచి ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా హన్మకొండ జిల్లా కాజీపేట నుంచి బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయించింది.
అలాగే మేడారం జాతరకు ఆర్టీసి బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. దీనికోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని ఆర్టీసి అధికారులు వెల్లడించారు. కాగా, హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదయం 6.00, 6.30 గంటలకు జేబిఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబిఎస్ నుంచి బస్సులు బస్సులు మేడారంకు బయలుదేరి వెళతాయి. ఇందులో పెద్దలకు రూ.750లు, చిన్నారులకు రూ. 450ల టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఇక మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి, 2.30, 3.00 గంటలకు బస్సులు బయలుదేరతాయి. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ బస్సుల్లో రానుపోనూ టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లుగా టికెట్‌ల ధరను ఆర్టీసి నిర్ణయించింది.
ఇక సూపర్‌లగ్జరీ బస్సులు, ఎసి బస్సులను కూడా నడపాలని ఆర్టీసి భావిస్తోంది. కానీ, వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. అయితే సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550లు, ఎసి బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750లుగా నిర్ణయించారు.