Thursday, November 14, 2024

అంటరాని మహర్ సైనికుల శౌర్యం!

- Advertisement -
- Advertisement -

వేల ఏళ్లుగా వేళ్ళూనుకుపోయిన కుల వ్యవస్థ దాష్టీకానికి, దుర్మార్గానికి సమిధ లైపోయారు ఈ దేశ మూల వాసులు. ఆ తర్వాత ‘మనుస్మృతి’ ఆర్య బ్రాహ్మణుల ఆగడాలకు అక్షర రూపమిచ్చి, శాశ్వతం చేసి వ్యవస్థీకృతం చేసింది. ఈ మనుస్మృతి, మనువాదానికి వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే, బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, పండిత అయోతీ దాస్, అయ్యంకాలి, మాదరి భాగ్యరెడ్డి వర్మ లాంటి మహనీయులు పోరాటం చేసిన విషయం మనందరికీ విదితమే. కానీ వీరందరి కంటే ముందే 1818లోనే మనువాదాన్ని మట్టుబెట్టడానికి, తరతరాల తమ వెతలను తరిమి కొట్టడానికి, యుగయుగాల తమ బానిసత్వాన్ని బద్దలు కొట్టడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కదన రంగంలోకి దూకి జయకేతనం ఎగరేసిన మహా యోధులు 500 మంది మహర్ సైనికులు. ప్రపంచ మానవ చరిత్రలోనే మహత్తరమైన యుద్ధానికి కేంద్ర బిందువు మహారాష్ట్రలోని పుణెకు ముప్పై కిలోమీటర్ల దూరంలో భీమా నది ఒడ్డున ఉన్న ‘కోరేగావ్’ గ్రామం. అదే భీమా కోరేగావ్.

మహర్ సైనికులు వలస వచ్చిన బ్రిటీషు వారితో కలిసి స్వదేశీయులైన పీష్వాలపైన యుద్ధం చేయడం ఏమిటి? అసలు ఈ యుద్ధం నేపథ్యం ఏమిటి? ఈ చారిత్రక యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ‘కల్నల్ బార్టన్’ 2వ బాజీరావు పీష్వా ఆధ్వర్యంలోని సైన్యం పుణె చుట్టుముట్టి ఉంది. వారిని ఎదుర్కొనేందుకు తగిన సైనిక బలగాలు పంపమని శిరూరు క్యాంపు హెడ్ క్వార్టర్స్‌లో అధికారిగా ఉన్న లెఫ్టినెంటు కల్నల్ ఫిల్స్మన్‌కు సందేశం అందించాడు. అప్పటికే తమ వద్ద తీవ్రమైన సైనిక కొరతతో బాధపడుతున్న ఫిల్స్మన్ సందిగ్ధంలో పడ్డాడు. తక్కువ సంఖ్య అయినా అత్యధిక, అసమాన ధైర్య సాహసాలు గల సేనల అవసరం ఉంది. అప్పుడే తన మెదడులో ఒక మెరికల్లాంటి ఆలోచన కలిగింది. 1779 వద్గావ్ యుద్ధంలో మహాదాజీ షిండే నాయకత్వంలో పీష్వాల తరపున యుద్ధం చేసి, బ్రిటిష్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ కూడా పీష్వాల చేత సామాజిక అణచివేతకు గురవడంతో తిరుగుబాటుగా బ్రిటీష్ సైన్యంలో చేరిన ప్రాచీన భారత నాగా జాతి వీరులు మహర్ సైనికులతో ఏర్పాటు చేసిన బొంబాయి ఇన్ఫాంటరీ, మొదటి రెజిమెంట్, రెండవ బెటాలియన్ గుర్తుకొచ్చింది.

వెంటనే ఆ బెటాలియన్ అధికారి కెప్టెన్ స్టాటన్‌కు వర్తమానం పంపారు. ఆ వర్తమానం అందిన కెప్టెన్ స్టాటన్, మహర్ సైనికులకు నాయకత్వం వహిస్తున్న సుబేదార్ శికనాగ్‌కు విషయం తెలియజేసి సహాయం కోరాడు.అప్పుడు పరదేశస్థుల తరపున పోరాడి సాటి భారతీయులతో యుద్ధం చేయడం ఇష్టంలేని శికనాగ్ కొంత సమయం కోరాడు. ఈ సమయంలో శికనాగ్ ‘బ్రిటీషు సైన్యంతో కలిసి స్వంత దేశస్థుల మీద యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు.యుద్ధం నిరాకరించి పీష్వాల విజయానికి తోడ్పడితే స్వతంత్ర పీష్వా రాజ్యంలో మా (అస్పృశ్యుల) సామాజిక స్థాయి ఏ విధంగా ఉంటుంది’ అని పీష్వాల సైన్యాధికారి బాపు గోఖలేనికి వర్తమానం పంపాడు. దానికి సమాధానంగా అణువణువునా మనుస్మృతి భావజాలాన్ని నింపుకున్న బ్రాహ్మణుడు బాపు గోఖలే ‘మేం గెలిస్తే సంప్రదాయంగా వస్తున్న వర్ణాశ్రమ ధర్మం మీకు ఇచ్చిన స్థానాన్నే కొనసాగించబడుతుంది’ అంటూ సమాధానమిచ్చాడు. పీష్వాల పోరాటం బ్రిటీషు వారికి వ్యతిరేకం కాదు, ఈ దేశ ప్రజలను విముక్తులను చేయడానికి ఏమాత్రం కాదు కేవలం తమ బ్రాహ్మణ వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుకుని, బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసమేనని అర్థం చేసుకున్న సుబేదార్ శికనాగ్, స్టాటన్ దగ్గరికి వెళ్ళి యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమేనని ప్రకటించాడు.

డిసెంబర్ 31వ తేదీన సుబేదార్ శికనాగ్ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు, బ్రిటీషర్లతో కూడిన 250 మంది అశ్వదళం, 24 గన్నర్లతో బెటాలియన్ బయలుదేరింది. 150 కి.మీ ప్రయాణించేటప్పటికి తమ వెంట తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. మరుసటి రోజు అనగా 1 వ జనవరి 1818 నాడు మిగిలిన ఆహార ధాన్యాలు అందరికీ సరిపోవని, గంజి కాచుకుని అదే తాగి ముందుకు సాగుతున్న మహర్ సైన్యానికి భీమా నది ఒడ్డున ఉన్న కోరేగావ్ గ్రామంలో 20 వేల పదాతి దళం, 8 వేల మంది అశ్వదళంతో కూడిన పీష్వాల సైన్యం ఎదురైంది. తమ సంఖ్య కంటే దాదాపు 50 రెట్లు అధికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసి భయపడకుండా, వెనకడుగు వేయకుండా ముందుకు దూకింది మహర్ సైన్యం. మధ్యాహ్నానికి తమ వెంట వచ్చిన అశ్వదళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారు కూడా పారిపోయినా కూడా వెనకడుగు వేయకుండా పోరాడ సాగింది. ఒక్కొక్క సైనికుడు 40 మందితో పోరాడడం చూసి ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కెప్టెన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనలను లొంగిపోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శికనాగ్ తీవ్ర స్వరంతో ‘చరిత్రలో మాకు అవకాశం వచ్చిన ప్రతీసారీ మేము ఏమిటో నిరూపించాం. మళ్ళీ ఈ రోజు మాకు అవకాశం వచ్చింది. వందల సంవత్సరాలుగా మమ్మల్ని బానిసలుగా మార్చి, చిత్ర హింసలకు గురి చేసి, పశువుల కన్నా హీనమైన బతుకులు అనుభవించేలా చేసిన ఈ బ్రాహ్మణ భావజాల పీష్వా ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఈ రోజు వచ్చిన ఈ అవకాశాన్ని మేం వదులుకోము. నువ్వు భయపడకుండా చూస్తూ ఉండు కెప్టెన్ సాబ్. మా అఖరి రక్తం బొట్టు పోయేదాకా మేము పోరాడుతాం’ అన్నాడు.

శికనాగ్ ధైర్యానికి, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపడిన కెప్టెన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆహారం, నీరు కూడా లేకుండా ఆ రోజు ఒక పగలు, ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు. శికనాగ్ చెప్పినట్టుగానే చావుకే భయం పుట్టించే విధంగా పోరాడిన మహర్ల ప్రతాపానికి భీమా నది పీష్వాల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శికనాగ్. తలలేని కొడుకు శవాన్ని వొడిలో పెట్టుకుని పిచ్చివాడిలా ఏడుస్తూ, భయంతో వణికిపోతూ, అందరూ పారిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు బాపు గోఖలే. దీంతో భయకంపితులైన పీష్వా సైన్యం, ఫూల్గావ్‌లోని బాజీరావు శిబిరంవైపు పరుగులు తీశారు. వారిని భీమానది దాటే దాకా తరిమితరిమి జయకేతనం ఎగరేసింది మహర్ సైన్యం.

బ్రిటీషు ప్రభుత్వం ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కొరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ప్రాంతంలో ‘విజయ స్థూపం’ ఏర్పాటు చేసింది. యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లు ఆ విజయ స్థూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది. తర్వాత కాలంలో స్వాతంత్య్రానికి ముందు ఈ బ్రాహ్మణీయ వ్యవస్థతో జరిగిన రహస్య అధికార బదిలీ ఒప్పందానికి తలవంచిన బ్రిటిష్ ప్రభుత్వం, ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి అంటరాని వారిని సైన్యం, పోలీసు విభాగాలలో చేర్చుకోకూడదని 1927లో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేడ్కర్ ‘ఇది పోరాట యోధుల చరిత్ర కనుమరుగు చేసే కుట్ర’ అంటూ విజయ స్థూపం వద్ద ప్రదర్శనకు పిలుపునివ్వడంతో దేశ నలుమూలల నుండి లక్షలాది ప్రజలు హాజరయ్యారు. ప్రజల శక్తి చూసిన బ్రిటిష్ ప్రభుత్వం మహర్ రెజిమెంట్ కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. మొదట్లో కేవలం మహర్లు, మాలలు, హోలియలు, మల్లలు, పరయాలు, కొరీ కులస్థులతో మాత్రమే ఉన్న మహర్ రెజిమెంట్ ఇప్పుడు అన్ని కులాల సైనికులతో ఈ రోజుకి కూడా కొనసాగుతోంది.

బాబాసాహెబ్ అంబేడ్కర్ తను చనిపోయే దాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న తప్పకుండా విజయ స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించి అక్కడ నిద్రించేవారు అంటే భీమా కోరేగావ్ యుద్ధం ఆయన్ని ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. వేల ఏళ్లుగా హరించివేయబడ్డ తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛా, సమానత్వం కోసం పరితపించి పోరాటం చేసిన మహర్ యోధుల శౌర్యం నేటి అణగారిన ప్రజలకు ఆదర్శం. నేటి ఆధునిక సమాజంలో, అంతరిక్షానికి దారులు వేస్తున్న సమయంలో కూడా దేశంలో రోజురోజుకీ కుల వ్యవస్థ తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంటూనే ఉంది. అనునిత్యం దేశం ఏదో ఒక మూలన ఎస్‌సి, బిసిలను గ్రామాల నుండి వెలివేస్తున్నారు. దళితుల హత్యలు, దళిత స్త్రీలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. సామాజిక, -ఆర్థిక-, రాజకీయ రంగాల్లో దళితులపై వివక్ష పెరుగుతుంది. మత విద్వేషాలు పెరిగిపోవడం వల్ల దేశంలో అసహనం పెరుగుతుంది అని ఇటీవల అనేక సర్వేలు, నివేదికలు వెల్లడిస్తున్న ఈ సందర్భంలో నాడు హక్కులు, ఆత్మగౌరవం కోసం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన భీమా కోరేగావ్ మహర్ వీరుల పోరాట స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవడం చారిత్రక అవసరం.

భీమా కోరేగావ్ మహర్ వీరుల పోరాటం తనలో రగిలించిన స్ఫూర్తితో డా.బి.ఆర్. అంబేడ్కర్ జీవితాంతం చెప్పడమే కాకుండా ఆచరణలో చూపిన ‘హరించి వేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి గాని, ప్రాధేయపడి గాని సాధించలేం, నిరంతర పోరాటాల వల్లనే సాధించగలం’ అనే నినాదం అణగారిన ప్రజల ఆచరణ మార్గం కావాలి. అప్పుడే ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లి సమసమాజ స్థాపన జరుగుతుంది. ఈ దేశంలో బ్రాహ్మణీయ భావాజాలంపై, మనువాద వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, వెన్నుచూపని ధైర్యంతో పోరాడిన భీమా కోరేగావ్ మహర్ యోధులను మది నిండా స్మరించుకుంటూ నీలి పూల నివాళి.

డా. మంచాల లింగ స్వామి- 8099222020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News