Thursday, November 21, 2024

ఉధృతం.. ‘మహా’యుద్ధం

- Advertisement -
- Advertisement -

మరో వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రచారం వాడివేడిగా కొనసాగుతోంది. అధికార మహాయుతి కూటమి, విపక్ష మహావికాస్ అఘాడీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. మహాయుతి తరఫున తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగి, సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టడంతో ఎన్నికల జోష్ అమాంతం పెరిగిపోయింది. కేవలం ప్రచారమే కాదు, పార్టీల మేనిఫెస్టోలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకే రోజు బిజెపి, మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికల్లో రకరకాల హామీలను గుప్పించాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘సంకల్పపత్ర- 2024’ పేరిట ఆవిష్కరించిన బిజెపి మేనిఫెస్టోలో రైతులు, నిరుద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు.

ఉద్యోగ నియామకాలతోపాటు ఏటా 10 లక్షల మందికి పదివేల రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని కమలనాథులు నమ్మబలుకుతున్నారు. మహావికాస్ అఘాడీ ‘మహారాష్ట్రనామా’ పేరిట వెలువరించిన మేనిఫెస్టోలో మహిళల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే దిశగా రకరకాల హామీలను వండివార్చింది. 9- 16 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ నిరోధక టీకాలను ఉచితంగా అందజేస్తామని, నెలసరి సమయంలో ఉద్యోగినులకు రెండు ఐచ్ఛిక సెలవులు, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ ఎంవిఎ అభయమిస్తోంది. మహారాష్ట్రలో ప్రధాన పార్టీలుగా చెలామణీ అవుతున్న శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీల్లో చీలికలు రావడం గత మూడేళ్లలో జరిగిన కీలకమైన పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి, వేరు కుంపటి పెట్టి అధికార పగ్గాలు చేపట్టగా, ఎన్‌సిపిని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ నిలువునా చీల్చి అధికార కూటమిలో చేరారు. ఈ రెండు పరిణామాల కారణంగా ఓటర్లలో ‘ఇండియా’ కూటమి పట్ల సానుభూతి పెరిగింది. ఆ ప్రభావం మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కనిపించింది కూడా.

మొత్తం 48 స్థానాల్లో ఇండియా కూటమి 29 సీట్లను గెలుచుకోగా, ఎన్‌డిఎ 17 స్థానాలకు పరిమితమైంది. ఇదే ఊపును అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని మహావికాస్ అఘాడీ పట్టుదలతో ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వెంట్రుకవాసి తేడాతో అధికారానికి దూరం కావడం కూడా ‘ఇండియా’ కూటమి నేతలను జాగృతం చేసింది. మళ్లీ అలాంటి పొరబాట్లు పునరావృతం కాకుండా ముందునుంచే జాగ్రత్త పడుతున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక వంటి కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాన్ని పరుగులెత్తిస్తున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందినా, ఓట్ల శాతంలో మాత్రం ‘ఇండియా’ కూటమికి, తమకూ మధ్య పెద్ద తేడా లేదని, కాబట్టి ఈసారి విజయం తమదేనని ఎన్‌డిఎ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. పైగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గమనించిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీ ఎన్నికలకు తెర లేవడానికి ముందే అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

షిండే తనకు వెన్నుపోటు పొడిచారంటూ శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాకరే, మేనల్లుడు చేసిన ‘నమ్మకద్రోహా’న్ని శరద్ పవార్ విడమరచి చెప్పి ఓటర్ల సానుభూతి పొందడంలో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సానుభూతి అస్త్రం పనిచేస్తుందో లేదో వేచిచూడాలి. తనకు ఇవే చివరి ఎన్నికలని శరద్ పవార్ చెప్పడం కూడా సానుభూతి పొందే యత్నమే. ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న భారతదేశం కల నెరవేరాలంటే ఆర్థిక రాజధాని ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం ఎంతయినా అవసరం. గత ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ సుస్థిరత కొడిగట్టిన దీపంలా మారింది. రెండు ప్రధాన పార్టీలు నిట్టనిలువునా చీలిపోయాయి. ఉపాధి లేమి, ధరల పెరుగుదల, రిజర్వేషన్ల కోసం మరాఠాల పోరాటం వంటివి రాష్ట్రాభివృద్ధికి పగ్గాలు వేస్తున్నాయి. దీనికితోడు అనేక ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలిపోవడం కూడా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రభావం చూపే అంశమే. ఈ నేపథ్యంలో నవంబర్ 20న ఓటర్లు ఇచ్చే తీర్పు మహారాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం కానున్నదని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News