నా మద్దతు పూర్తిగా ఉంటుంది
మహాయుతి పార్టీల మధ్య విభేదాలు లేవు
ఏక్‌నాథ్ షిండే
ముంబయి : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై బిజెపి నిర్ణయం తీసుకుంటుందని, కొత్త సిఎంకు తన మద్దతు పూర్తిగా ఉంటుందని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటుపై మహాయుతి భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు ఏవీ లేవని షిండే స్పష్టం చేశారు. షిండే సతారా జిల్లాలోని స్వగ్రామం దరెలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయని, మహాయుతిలోని మూడు భాగస్వామ్య పక్షాలు శివసేన, బిజెపి, ఎన్‌సిపి ఏకాభిప్రాయంతో అన్ని నిర్ణయాలు తీసుకుంటాయని కూడా చెప్పారు.
తాను స్వగ్రామానికి క్రమం తప్పకుండా వస్తుంటానని చెప్పిన షిండే సిఎం పదవిపై తన వైఖరిని క్రితం వారమే స్పష్టం చేసిన తరువాత (తన పర్యటనపై) ఎందుకు అంత గందరగోళం అని అడిగారు. తన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్ షిండే ఉప ముఖ్యమంత్రి కాగలరన్న ఊహాగానాల గురించి ప్రశ్నించగా, చర్చలు జరుగుతున్నాయని షిండే సమాధానం ఇచ్చారు. కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకుంటున్న తీరుపై అసంతుష్టితో ఉన్నారనే ఊహాగానాల మధ్య శుక్రవారం తన స్వగ్రామానికి వెళ్లిన షిండే అస్వస్థులయ్యారని, త్వరలోనే ముంబయి చేరుకుంటారని ఆయన సహాయకుడు ఆదివారం ఉదయం తెలిపారు.
కొత్త మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 5 సాయంత్రం జరుగుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి హాజరవుతారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులె చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రకటన ఇంత వరకు రాలేదు. కానీ గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా, గత ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఆ పదవికి ప్రధాన అభ్యర్థి అని బిజెపి వర్గాలు తెలిపాయి.