ఆపద్ధర్మ సిఎంగా ఉండాలని గవర్నర్ సూచన
సిఎం పదవిపై కుదరని ఏకాభిప్రాయం
ముగిసిన అసెంబ్లీ గడువు
ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం దీనితో సుగమం అయింది. షిండే నాయకత్వంలోని శివసేన వర్గం ఆయనను కొనసాగించాలని కోరుతుండగా, ఆ పదవికి తమ అభ్యర్థి నియామకానికి బిజెపి పట్టుబట్టుతున్నది. సిఎం అభ్యర్థిపై కూటమి నేతలు ఇంకా ఏకాభిప్రాయానికి రావలసి ఉండగా, షిండే వారసుని ఎంపికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ వెంట రాగా షిండే మంగళవారం ఉదయం అధికారికంగా తన రాజీనామా సమర్పణ నిమిత్తం గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను కలుసుకున్నారు. దీనితో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని షిండేకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
కాగా, శాసనసభ గడువు మంగళవారం ముగిసింది. దీనితో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను వేగిరపరచవలసిన అవసరం వచ్చింది. అధికార మహాయుతి కూటమి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన కనబరచింది. మొత్తం 288 సీట్లలోకి 230 సీట్లను కూటమి కైవసం చేసుకున్నది. బిజెపి సొంతంగా 132 స్థానాలు గెలుపొందగా, శివసేన షిండే వర్గం 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి 41 సీట్లు పొందాయి. షిండే ప్రభుత్వంలోని మంత్రి దీపక్ కేసర్కర్ ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ. షిండే రాజీనామా, గవర్నర్ ఆదేశం గురించి తెలియజేశారు. కొత్త ప్రభుత్వం త్వరలోనే ప్రమాణ స్వీకారం చేస్తుందని కేసర్కర్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.