ముంబై: మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష మహా వికాస్ అఘడి(ఎంవిఎ) నిప్పులు చెరిగింది. దాంతో ఆయన తాను పదవి నుంచి దిగిపోవాలనుకుంటున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ముంబై సందర్శించినప్పుడు గవర్నర్ ఆయనని కలుసుకుని ‘నేను శేష జీవితాన్ని గ్రంథపఠనం, రచనల్లో కొనసాగించాలనుకుంటున్నాను’ అని తెలిపారు. ఆయన పత్రికా ప్రకటనలో కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపారు. ‘గొప్ప రాష్ట్రమైన మహారాష్ట్రకు రాజ్య సేవక్ లేక రాజ్యపాల్‌గా సేవలందించడం గర్వకారణంగా ఉంది. మహారాష్ట్ర సాధువులు, సామాజిక సంస్కర్తలు, యోధులకు నెలవైన రాష్ట్రం’ అని కోష్యారీ అన్నారు.
‘గత మూడేళ్లలో మహారాష్ట్ర ప్రజల నుంచి నాకు లభించిన ఆదరాభిమానాలు మరచిపోలేనివి. ఇటీవల ప్రధాని మోడీ ముంబై వచ్చినప్పుడు కూడా నేను రాజకీయ జీవితం నుంచి విరమించుకుని నా శేష జీవితాన్ని పుస్తక పఠనం, రచనలో గడుపాలనుకుంటున్నాను’ అని తెలిపాను అన్నారు.
ఔరంగాబాద్‌లో ఇటీవల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడ యూనివర్శిటీ స్నాతకోత్సవం జరిగింది. అప్పుడు కోష్యారీ ప్రసంగిస్తూ ‘…ఇదివరలో, మీకు ఆదర్శం ఎవరని అడిగితే జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, మహాత్మాగాంధీ అని జవాబిస్తుండేవారు. మహారాష్ట్రలో మీరు మరొకరి పేరు చెప్పుకోనవసరంలేదు. మీకిక్కడ చాలా మంది దిగ్గజాలున్నారు. పాత కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్, నేటి కాలంలో బాబా సాహెబ్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ వంటి వారున్నారు” అన్నారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మహా వికాస్ అఘడి ముంబైలో భారీ ప్రదర్శనను నిర్వహించింది.