Monday, December 23, 2024

భారత్ అభివృద్ధి కుంటుపడుతుంది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే సకల జనుల కష్టాలు తొలగిపోతాయి
మూసపద్దతితో కూడిన పాలనారీతుల వల్ల భారత్ అభివృద్ధి కుంటుపడుతుంది
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మహారాష్ట్ర అహ్మద్‌నగర్ నుంచి పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక
మనతెలంగాణ/హైదరాబాద్: పరివర్తన చెందిన భారత దేశంతో మాత్రమే, దేశంలో రైతులు దళిత బహుజన ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. సాంప్రదాయ పార్టీలు తమ చిత్తశుద్దిలేని కార్యాచరణతో మూసపద్దతితో కూడిన పాలనారీతులు కొనసాగించినన్నాల్లూ భారత్ అభివృద్ధి కుంటుపడుతుందని పునరుద్ఘాటించారు. బిఆర్‌ఎస్ పార్టీలోకి బుధవారం కూడా చేరికలు కొనసాగాయి. బిఆర్‌ఎస్ ప్రభుత్వ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి పట్ల దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చతో బిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు కదిలి వస్తున్నారు. బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ కార్యాచరణ దేశమంతా విస్తరించాలన్న సంకల్పంతో బిఆర్‌ఎస్ పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ నుంచి పలువురు ప్రముఖులు అధినేత, సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో బుధవారం బిఆర్‌ఎస్ పార్టీ నాగ్‌పూర్ కార్యాలయంలో ఎన్‌సిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్ చేరిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. వీరు అహ్మద్ నగర్ జిల్లా శ్రీగోంధా నియోజకవర్గంలో రాజకీయంగా ప్రజల్లో పట్టు వున్న నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్లను సాధించి గెలుపు ప్రకటించిన అనంతర సాంకేతిక కారణాలతో ఓటమిని ప్రకటించడంతో గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయారు. ఇంకా పార్టీలో చేరిన వారిలో.. ఎన్‌సిపి పార్టీ ఓబిసి సెల్ అహ్మద్‌నగర్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ ఆనంద్కర్‌తో పాటు..సర్పంచ్ శరద్ పవార్, దర్శకుడు ప్రకాష్ నింభోర్, కుక్డి చక్కెర కర్మాగారం సభ్యుడు అబాసాహెబ్ షిండే, మాజీ ఛైర్మన్ విలాస్ భైలుమే, సర్పంచ్ కేశవ్ జెండే, సర్పంచ్ షాహాజీ ఇతాపే, ఛైర్మన్ సొసైటీకి చెందిన చంద్రకాంత్ పవార్, ప్రకాష్ పోతే, ప్రశాంత్ షెలార్, సిద్ధేష్ ఆనంద్కర్, ప్రవీణ్ షెలార్, సంజయ్ వాగాస్కర్, వహతుక్ సేన అధ్యక్షుడు సందీప్ దహతోండే, సేవాదల్‌కు చెందిన షామ్ జారే తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సిఎం కెసిఆర్ విధానాలను దేశమంతా విస్తరించి అభివృద్ధి చెందిన భారతదేశం ఆవిష్కరణ దిశగా తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారంతా ప్రతినబూనారు. ఈ సందర్భంగా…బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాకెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని, పాలకులకు అందుబాటులో వున్న వనరులను వినియోగించుకోవాలనే తపన మనసుండాలని అన్నారు.

తెలంగాణ దేశానికే రోల్ మోడలయ్యింది
ప్రజల కోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచనా విధానాలు ఏడు దశాబ్దాల పాలకులకు లేకపోవడం ఈ దేశ ప్రజల దురదృష్టమని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ భూగోళం మీద ఏ దేశానికి లేనన్ని సహజ వనరులు ఈ దేశం సొంతం అని వ్యాఖ్యానించారు. అయినా ఇన్ని దశబ్ధాలయినా కూడా రైతులు బడుగు బలహీన వర్గాలు కనీస అవసరాలయిన నీరు విద్యుత్ కోసం తపిస్తున్నారని, ఇది శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు రైతు కేంద్రంగా దళిత ఆదివాసీ బలహీన వర్గాలు కేంద్రంగా పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలని తెలిపారు. అట్లా చేసుకోగలిగినం కాబట్టే నేడు తెలంగాణ దేశానికే రోల్ మోడలయ్యిందన్నారు. ఈ దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే అతి పిన్నవయసున్న తెలంగాణ అత్యంత తక్కువ కాలంలో ఎట్లా ఓ రోల్ మోడల్ కాగలిగింది..?, నేడు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్‌నే కోరుకోవడానికి కారణమేంది..? అనే విషయాలను సిఎం వివరించారు.

దేశంలో పరివర్తన రానిదే అభివృద్ధి జరగదు
తెలంగాణను అభివృద్ధి చేసుకున్న పద్దతిలో, ఈ దేశంలో పాలన సాగటం లేదని కెసిఆర్ తెలిపారు. ఈ దేశంలో పరివర్తన రానిదే అభివృద్ధి జరగదని అన్నారు. పరివర్తన తీసుకువచ్చే ఆలోచన కేంద్రంలోని పాలకులకు లేరని, వీల్లకు అసలు ఆ ఆలోచనే లేదని విమర్శించారు. మూస ధోరణులు అధికారుల మీద ఆధారపడడం కాలం ఎల్లదీయడం తప్ప..ప్రజా సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చేయాలనే మనసు లేనే లేదని పేర్కొన్నారు. మనసుంటే తప్పకుంటా మార్గం వుంటుందనే విషయాన్ని తొమ్మిదేండ్ల తెలంగాణ నిరూపించిందని సిఎం స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాగునీటి వ్యవస్థను చక్కదిద్దడానికి వ్యవసాయాన్ని పండగలా చేయడానికి రైతాంగంలో భరోసానిపండానికి తాను ఎట్లాంటి ఆలోచనలు చేసాననే విషయాన్ని ఈ సందర్భంగా మహారాష్ట్ర నేతలకు సిఎం కెసిఆర్ వివరించారు. పరిపాలనలో తలెత్తే సమస్యలను అధిగమిస్తూ ప్రజలవద్దకు పాలన తీసుకుపోవడం కోసం తాను ఎంచుకున్న మార్గాలు ఆచరించిన విధివిధానాలు ఏమిటో విశ్లేషించి చెప్తున్నప్పుడు..మహారాష్ట్ర నేతల్లో తామొక నూతన పాలన వరవడి విధానం గురించి వింటున్నామని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. హర్షాతిరేకంగా జై కెసిఆర్ అంటూ నినాదాలు చేశారు.

తమ మహారాష్ట్రలో కూడా ఇటువంటి తెలంగాణ మోడల్ పాలన కావాలని మరోసారి కోరుకున్నారు.కాగా, బిఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి దిశగా భారత దేశంలో సమూల మార్పును తీసుకువచ్చేందుకు పుట్టిన పార్టీ అని.. అందుకు ముందడుగు మహారాష్ట్ర నుంచి పడుతున్నందుకు సంతోషంగా వుందని సిఎం తెలిపారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రైతులు మహిళలు యువత చైతన్యమై కలసికట్టుగా నిలబడి పార్టీలను కాకుండా ప్రజా ఆంకాంక్షలను గెలిపించుకునేందుకు కృషి కొనసాగించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, బిఆర్‌ఎస్ మహారాష్ట్ర నేతలు ఖదీర్ మౌలానా హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News