హైదరాబాద్: ప్రజల కోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచనా విధానాలు ఏడు దశాబ్దాల పాలకులకు లేకపోవడం ఈ దేశ ప్రజల దురదృష్టమని సిఎం కెసిఆర్ అన్నారు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ నుంచి పలువురు ప్రముఖులు సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఈ భూగోళం మీద ఏ దేశానికి లేనన్ని సహజ వనరులు ఈ దేశం సొంతమని చెప్పారు. అయినా ఇన్ని దశబ్ధాలయినా కూడా రైతులు బడుగు బలహీన వర్గాలు కనీస అవసరాలయిన నీరు విద్యుత్ కోసం తపిస్తున్నారని, ఇది శోచనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు రైతు కేంద్రంగా దళిత ఆదివాసీ బలహీన వర్గాలు కేంద్రంగా పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలని తెలిపారు. అట్లా చేసుకోగలిగినం కాబట్టే నేడు తెలంగాణ దేశానికే రోల్ మోడలయ్యిందన్నారు. ఈ దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే అతి పిన్నవయసున్న తెలంగాణ అత్యంత తక్కువ కాలంలో ఎట్లా ఓ రోల్ మోడల్ కాగలిగింది..?, నేడు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్‌నే కోరుకోవడానికి కారణమేంది..? అనే విషయాలను సిఎం వివరించారు.