Monday, December 23, 2024

కాళేశ్వరం ప్రపంచాద్భుతం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాలం గాని కష్టకాలంలో తెలంగాణ రైతాంగానికి వ్యవసాయానికి ప్రాణాధారమైన ప్రాణహిత నది జలాలను ఎత్తిపోస్తున్న కాళేశ్వ రం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నది. సిఎం కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ఆకర్షితులై మహారాష్ట్రకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. సిఎం కెసిఆర్ సూచన మేరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారథ్యంలో బిఆర్‌ఎస్ నేతలు కల్వకుంట్ల వంశీధర్ రావు, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకుల బృందం కాళేశ్వరం ప్రాజక్టును సందర్శించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు మ్యాప్ ఆధారంగా మహారాష్ట్ర నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను వివరించారు. నీటి ఎత్తిపోస్తున్న తీరు, పంపుల సామర్థ్యం, వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలను వారికి వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణ వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తున్న తీరును మ్యాపుల ఆధారంగా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యాచరణను, సిఎం కెసిఆర్ దార్శనికతను నాయకులు ప్రశంసించారు. సిఎం కెసిఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని వారు కొనియాడారు. సాగునీటి రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ సాధిస్తున్న ప్రగతి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తీరుతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ బాటలో పయనిస్తున్నాయని వారన్నారు. తన జీవితంలోనే ఇంతటి గొప్ప ప్రాజెక్టును చూడలేదని మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భానుదాస్ మార్కుటే అన్నారు. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాజెక్టును చూడబోమని అన్నారు. 32 దేశాలను తిరిగిన తాను ఇలాంటి మానవ నిర్మిత అద్భుతాన్ని ఎక్కడా చూడలేదని అన్నారు. సిఎం కెసిఆర్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని ప్రశంసించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును కళ్లరా చూసిన తన జన్మ ధన్యమైందని భానుదాస్ మార్కుటే తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన వారిలో మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భానుదాస్ మార్కుటే, అహ్మద్ నగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు అరుణ్ కదూ, ఎన్సీపి నేత బాలాసాహెబ్ విఖే పాటిల్ లతో పాటు మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నసాహెబ్ మనే, ఘనష్యాం అన్నా షెలార్, ప్రహ్లాద్ రాథోడ్, శరద్ పవార్, బాల సాహెబ్, అరుణ్ కొడు, ఏకనాథ్ గోగాడే తదితరులున్నారు. వీరి వెంట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకుడు వంశీధర్ రావు, ఈఎన్సీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News