Monday, December 23, 2024

శివసేన అంతమే బిజెపి లక్ష్యమా!

- Advertisement -
- Advertisement -

Maharashtra political Crisis

ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అక్కడ కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని తమ పాలన కింద తీసుకు రావాలని కాకుండా శివసేనని రాజకీయంగా సమాధి చేయాలనే పట్టుదల బిజెపిలో కనిపిస్తున్నది. అందుకనే చివరకు బిజెపి శ్రేణులకు సహితం విస్మయం కలిగించే విధంగా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను కాకుండా తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండేను చేసినట్లు స్పష్టమవుతుంది.
తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలను చీల్చడం, బలహీనం చేయడం గతంలో కాంగ్రెస్ చేస్తూ ఉంటే, కొంత కాలంగా బిజెపి కూడా చేస్తుంది. గత ఎనిమిదేళ్లలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను ఫిరాయింపులు, ఇతరత్రా చర్యల ద్వారా కూల్చి వేసి, తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న బిజెపి తొమ్మిదో సంవత్సరంలో తొమ్మిదో ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి రాగలిగింది. అయితే మహారాష్ట్రలో కేవలం ప్రభుత్వాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవడం కోసం మాత్రమే కాకూండా అంతకన్నా లోతయిన రాజకీయ వ్యూహంతో బిజెపి జాతీయ నాయకత్వం వ్యవహరించినట్లు కనిపిస్తున్నది. ఈ వ్యూహం పట్ల చివరకు ఈ తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసిన ఫడ్నవిస్‌కు కూడా తెలిసినట్లు లేదు.
31 నెలల క్రితం ఎన్‌సిపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేవలం మూడు రోజులలో తనను గద్దె దింపిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను గద్దె దించి తిరిగి తాను ముఖ్యమంత్రిగా త్వరలో వస్తాను అంటూ ఫడ్నవీస్ ఆ సమయంలో స్పష్టం చేశారు. అయితే ఈ ప్రభుత్వం 31 నెలల పాటు కొనసాగడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. కాంగ్రెస్, ఎన్‌సిపి ఎంఎల్‌ఎల నుండి ముప్పు వస్తుందనుకొంటే శివసేన ఎంఎల్‌ఎల నుండే రావడం కూడా విస్మయకరమే. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించి, ఇద్దరు ఎన్‌సిపి మంత్రులను జైలుకు పంపినా, పలువురు శివసేన నేతలపై దర్యాప్తులు చేపట్టినా ఎవ్వరూ లొంగలేదు. అయితే ఆ ఏజెన్సీల సహాయకర్మతోనే ‘జైలులో ఉంటారా? పదవులలో ఉంటారా?’ తేల్చుకోమని బెదిరింపులకు గురిచేసి ఇటువంటి తిరుగుబాటు చేయగలిగారని పలువురు భావిస్తున్నారు.
ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా వస్తే బాల్ థాకరే శివసేనను అధికారం కోసం గద్దె దించారనే అపవాదు రావడంతో పాటు, నేడు తిరుగుబాటు చేసిన ఎంఎల్‌ఎలు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల నుండి వచ్చే వత్తిడులను ఏ మాత్రం తట్టుకుంటారో అన్నది కూడా సందేహాస్పదమే. పైగా గద్దె దిగుతూ ఉద్ధవ్ ఉగ్వేగపూరితంగా చేసిన ప్రసంగం సాధారణ ప్రజలలో సహితం సానుభూతి తీసుకొచ్చింది. అందుకనే ఓ శివసైనికుడిని సిఎంగా చేయడం ద్వారా ఉద్ధవ్‌ను రాజకీయంగా తెరమరుగయ్యేటట్లు చేసి ఆ తరవాత శివసేనను కూడా సమాధి చేయాలనే లోతయిన ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. శివసేన కేవలం బిజెపికి మాత్రమే కాదు కాంగ్రెస్, ఎన్‌సిపిలకు కూడా కొరకురాని కొయ్యగా మారింది. అధికారంలో లేకపోయినా రాజకీయంగా ఆ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విశేష ప్రాబల్యం వహిస్తూ ఉండడంతో తరచూ అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకనే ఆ పార్టీని రాజకీయంగా సమాధి చేయడం కోసం ఎందరో లోపాయికారిగా సహకరించుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
నేడు శివసైనికుడికి ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లు 2019లోనే ఇచ్చి ఉంటే ఇప్పుడు బిజెపి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చేవారని మహా వికాస్ అఘా కూటమి ఏర్పాటు అయి ఉండెడిది కాదు గదా? అని థాకరే ప్రశ్నించడం గమనార్హం. 2019 ఎన్నికల ముందు స్వయంగా అమిత్ షా ఆయన ఇంటికి వచ్చి, ఆయనతో ఏకాంతంగా మాట్లాడి ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు పంచుకుంటాయని భరోసా ఇచ్చారు. అయితే ఎన్నికల అనంతరం ఈ హామీ నుండి బిజెపి వెనకడుగు వేయడంతో శివసేన ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కలవ వలసి వచ్చింది. శివసేనకు సిఎం పదవి ఇవ్వడానికి అమిత్ షా సుముఖంగా ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకొనకపోవడం వల్లననే ఆ విధంగా జరిగినట్లు తెలుస్తున్నది. 2013లో బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించడానికి ముందు ఎన్‌డిఎ భాగస్వామిగా శివసేన ఆ పదవికి సుష్మా స్వరాజ్ పేరును ప్రతిపాదించింది.
అప్పటి నుండి ప్రధానికి ఆ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అందుకనే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాధ్యం కాకపోవడంతో ఎన్‌డిఎ భాగస్వాములుగా ఉంటూనే ఎవ్వరికీ వారుగా పోటీ చేశారు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో బిజెపి శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. అయినా శివసేనను బలహీనం చేయడానికి చేయవలసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శివసేనకు చెందిన ఎంపి సురేష్ ప్రభును బిజెపిలో చేర్చుకొని రైల్వే మంత్రిగా చేశారు. శివసేనతో ఉద్ధవ్ నాయకత్వంపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరి, రాష్ట్రంలో మంత్రిగా చేరిన నారాయణ రణేను 2018లో బిజెపి నుండి రాజ్యసభకు ఎన్నికై 2021లో కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటి నుండి శివసేనను కట్టడి చేయడం కోసమే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. పైగా, శివసేన మనుగడ ఉన్నంత వరకు మహారాష్ట్రలో అదే నిజమైన ‘హిందుత్వ’ పార్టీగా ప్రజాదరణ పొందుతుందని, తమ రాజకీయ ఆధిపత్యం సాధ్యం కాదని గ్రహించిన బిజెపి అగ్రనాయకత్వం ఆ పార్టీని రాజకీయంగా తుద ముట్టించడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. బాల్ థాకరే ‘హిందుత్వ’ వారసులం తామే అనే సందేశం షిండే వర్గం ద్వారా చేరవేయడం కోసం ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నది.
పైగా 39 మంది ఎంఎల్‌ఎలు తిరుగుబాటు చేసినా ఫిరాయింపుల నిరోధక చట్టం క్రింద సుదీర్ఘ న్యాయసంబంధ వివాదాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మరోవంక ‘అసలు శివసేన’ ఎవ్వరు అంశంపై కూడా ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలలో వివాదాలు ఎదుర్కోవలసి ఉంటుంది. వీటన్నింటికి మించి క్షేత్రస్థాయిలో శివసైనికుల మద్దతు ఉద్ధవ్‌కు లేకుండా ఒంటరివానిగా చేయనిదే ఈ ప్రయత్నాలు అన్ని నిరుపయోగం కాగలదు. అందుకనే షిండేను ముఖ్యమంత్రిగా చేసినట్లు కనిపిస్తున్నది.
అయితే, ఇప్పటి వరకు కేవలం పార్టీ అధిష్ఠానం అండదండలతో మహారాష్ట్ర బిజెపిలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న ఫడ్నవీస్‌ను ఉపముఖ్యమంత్రిగా చేయడం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఆయనను కేంద్ర మంత్రిగా చేసి, రాష్ట్రంలో సమన్వయ కమిటీ చైర్మన్ చేసినా ప్రభుత్వంపై ఆధిపత్యం వహించే వారు. కేవలం రాజకీయంగా ఆయనను కట్టడి చేయడం కోసమే ఈ విధంగా చేసినట్లు కనిపిస్తుంది. బిజెపిలో ఎవ్వరూ రాజకీయంగా బలమైన నాయకులుగా ఎదగడంను బిజెపి అధిష్ఠానం సహించే పరిస్థితుల్లో లేదు.అందుకనే వివిధ సమీకరణాల పేరుతో కేవలం నియోజక వర్గాలకు పరిమితమైన వారికే కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, పార్టీలో కీలక నేతలుగా ప్రోత్సహిస్తుండటం కనిపిస్తుంది. ఫడ్నవీస్- ఉద్ధవ్‌ల మధ్య ‘అహంకారం’ బిజెపి, శివసేన కూటమి మధ్య సమస్యలు సృష్టిస్తే, ఇప్పుడు షిండే, ఫడ్నవీస్‌ల మధ్య అటువంటి సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.
ఫడ్నవీస్ ప్రజాకర్షణ గల నాయకుడు కాదు. అధిష్ఠానం అండదండలతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి. కానీ షిండే ఓ కార్పొరేటర్ స్థాయి నుండి ముఖ్యమంత్రి పదవికి వచ్చారు. తగు పరిపాలన అనుభవం కూడా ఉంది. పైగా సంక్షోభాల పరిష్కారంలో దిట్టగా పేరుంది. అందుకనే పాలనా యంత్రాంగంలో వీరిద్దరి మధ్య సయోధ్య అనుమానాస్పదమే కాగలదు. శివసేన ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ‘అసహజ కూటమి’గా బిజెపి అభివర్ణించింది. అయితే, ఇప్పుడు షిండే, ఫడ్నవీస్‌ల మధ్య జరిపిన పదవుల పంపకం ‘అసహజ నాయకత్వం’ కాగలదని పలువురు బిజెపి నాయకులే భావిస్తున్నారు. ఒక విధంగా ఈ ఏర్పాటు రాష్ట్రంలోని బిజెపి నాయకులకు ఇబ్బందికరమే. అయితే, బిజెపి జాతీయ నాయకత్వం ఆలోచనలు వేరు.
దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా 48 లోక్‌సభ సీట్లు మహారాష్ట్రలో ఉన్నాయి. వాటిల్లో కనీసం 40 వరకు సొంతంగా గాని, మద్దతుదారులుగాని గెలుచుకోవడం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అత్యవసరం. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంటే వారు అత్యధికంగా సీట్లు గెల్చుకొనే అవకాశం ఉంది. అందుకనే 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రస్తుత ‘తిరుగుబాటు’ జరిపించినట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినా మరి కొద్దీ నెలలో జరిగే బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన మూడు దశాబ్దాలుగా వహిస్తున్న ఆధిపత్యానికి గండి పెట్టడం తక్షణ లక్ష్యం కాగలదు. ఆ తర్వాత 2024 ఎన్నికలపై దృష్టి పెడతారు. శివసేనతో సంస్థాగతంగా కూడా పట్టు గల షిండే ఈ విషయంలో ఉద్ధవ్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడంలో ఏమాత్రం విజయం సాధిస్తారో అన్న అంశంపై బిజెపి ఆడుతున్న ప్రస్తుత రాజకీయ నాటకం ఫలితం ఆధారపడి ఉంటుంది.
రాబోయే రోజులలో శివసేన శ్రేణులపై ఉద్ధవ్ తన పట్టును ఏమాత్రం నిలుపుకుంటారో, తిరుగుబాటు చేసిన శివసేన ఎంఎల్‌ఎ లు న్యాయపరమైన చిక్కులను ఏ విధంగా అధిగమిస్తారో, చివరకు క్షేత్రస్థాయిలో ఎవ్వరు మద్దతు, సానుభూతిలను కూడదీసుకుంటారో అన్న అంశాలపై బిజెపి వ్యూహాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదేమైనా మహారాష్ట్రలో బిజెపికి ఇప్పుడు ప్రజాకర్షణ గల నాయకత్వం లేదు. ఈ లోటును షిండే ఏ మాత్రం పూరిస్తారో చూడవలసి ఉంది. పైగా షిండే వర్గం శివసేనను సొంతం చేసుకుంటారా? లేదా బిజెపిలో విలీనం అవుతారా? చూడవలసి ఉంది.

Maharashtra political Crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News