Saturday, December 28, 2024

మహా సంక్షోభం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: రాజకీయాల్లో క్రమశిక్షణను జుట్టుపట్టి, పెడరెక్కలు విరిచికట్టి మట్టి కరిపించిన హీన చరిత్రను మూట కట్టుకోడంలో భారతీయ జనతా పార్టీకి సాటి మరొక పార్టీ లేదు. ఈ క్రీడను అది నిరంతరం రక్తి కట్టిస్తూనే ఉంది. అందుకు కొత్త కొత్త సందుల అన్వేషణ సాగిస్తున్నది. దేశ భవిష్యత్తును ఘనంగా తీర్చి దిద్దడానికి ప్రజలు కేంద్రంలో తనకిచ్చిన అధికారాన్ని ఇందుకోసం దుర్వినియోగం చేస్తూనే ఉంది. తన చేతిలో గల సిబిఐ, ఇడి తదితర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి దారుణంగా దుర్వినియోగం చేస్తున్నది. రాజస్థాన్‌లో ఎదురైన వైఫల్యాన్ని మినహాయిస్తే ఇంకెక్కడా ఈ దొడ్డిదారి అధికార కైవసంలో, ప్రజాస్వామ్య హంతక నిర్వాకంలో, ప్రజాభిప్రాయానికి వెన్నుపోటు పొడిచే క్రూర విన్యాసంలో దానికి ఎదురు లేకుండా పోతున్నది.

మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మేఘాలయ, మణిపూర్, గోవా, బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో ప్రజలు యెన్నికల ద్వారా ఇచ్చిన తీర్పుకి తూట్లు పొడవడంలో అనితర సాధ్యమైన తన ప్రతిభను ప్రదర్శించింది. మహారాష్ట్రలో గతంలో వొకసారి ఘోరంగా విఫలమైన బిజెపి ఈసారి గట్టిగానే పావులు కదిపింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ముచ్చెమటలు పట్టించింది. నేరుగా అధికార కూటమి మహా వికాస్ అఘాది సారథి శివసేనలోనే అతిపెద్ద చీలిక తీసుకురాడం ద్వారా దిగ్భ్రాంతికరమైన ఫిరాయింపుల పర్వానికి తెర లేపింది. ఆ పార్టీకి చెందిన 56 మంది శాసనసభ్యుల్లో 40 మందికిపైగా ఎంఎల్‌ఎలతో సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే బిజెపి పాలిత అసోం (గౌహతి)లో శిబిరం ఏర్పాటు చేసి ఉద్ధవ్ ప్రభుత్వ ఊపిరికి ఎసరు పెట్టాడు. దీనితో ఉద్ధవ్ థాకరే దక్షిణ ముంబైలోని తన అధికార భవనాన్ని ఖాళీచేసి ముంబై నగర శివారుల్లోని బాంద్రాలో గల స్వగృహం మాత్రోశ్రీకి నివాసాన్ని హుటాహుటిన మార్చివేశారు.

తిరుగుబాటు శాసన సభ్యులు వచ్చి స్వయంగా కోరితే ముఖ్యమంత్రి పదవి నుంచే కాక శివసేన అధ్యక్షత నుంచి సైతం తప్పుకోడానికి సిద్ధమని ప్రకటించారు. ఇందుకు బదులుగా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్ షిండే ప్రతిపాదించడం గమనించవలసిన విషయం. తన సొంత మనుషులే తన పట్ల విశ్వాసం కోల్పోడం తన విషాదమని ఉద్ధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏక్‌నాథ్ షిండేను శివసేన శాసన సభ పక్ష నేతగా ఆయన బృందం యెన్నుకొన్నది. ఆ మేరకు 34 మంది శాసన సభ్యుల సంతకాలతో వొక లేఖను మహారాష్ట్ర గవర్నరుకు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు పంపారు. సంతకాలు చేసిన శాసన సభ్యుల్లో నలుగురు ఇండిపెండెంట్లున్నారు. ఈ పరిణామం శివసేన ఆంతరంగిక విషయమని పాలక కూటమి సభ్య పక్షాలు ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు వ్యాఖ్యానించాయి. ఇంత పెద్ద సంఖ్యలో శివసేన ఎమ్‌ఎల్‌ఎలు పార్టీని, రాష్ట్రాన్ని వీడి తొలుత గుజరాత్‌కు తరలించుకుపోతున్న సంగతిని రాష్ట్ర నిఘా విభాగం ముందుగా గమనించి హెచ్చరించకపోడం పట్ల హోం మంత్రిత్వ శాఖకు తన అసంతృప్తిని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ తెలియజేశారు. పాలక కూటమి పంపకంలో భాగంగా హోం శాఖ ఎన్‌సిపికి దక్కింది. రాజ్యాంగం ప్రకారం ఇటువంటి పరిస్థితిలో మంత్రివర్గ సిఫారసు మేరకు అసెంబ్లీని సమావేశపరచి బలపరీక్ష జరిపించవలసిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది.

గతంలో రాజ్‌భవన్లలోనే కాకి లెక్కలు వేసి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని గవర్నర్ల చేత చెప్పించి దానిని కూల్చివేసే నీచమైన పద్ధతి అమల్లో వుండేది. సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆ పద్ధతికి తెర దింపడంతో శాసన సభా వేదిక మీదనే బల పరీక్ష చేయక తప్పడం లేదు. ముఖ్యమంత్రి మెజారిటీని కోల్పోయిన నేపథ్యంలో మంత్రివర్గ సిఫారసు ప్రాధాన్యాన్ని కోల్పోడమూ సహజం. అందుచేత గవర్నర్ ఏకపక్షంగానే అసెంబ్లీని సమావేశ పరుస్తారేమో చూడాలి. ప్రజలు ఎన్నుకొని అధికారమిచ్చిన ప్రభుత్వాలను కూల్చివేసే దుర్మార్గానికి పార్టీ ఫిరాయింపులే కారణమవుతున్నాయి. దశాబ్దాల క్రితం హర్యానాలో మొదలైన ఈ ఆయారామ్ గయారామ్ దుష్ట సంస్కృతికి తెర పడితేగాని ప్రజాస్వామ్యానికి మేలు జరుగదు. ఎన్నికైన తర్వాత అధికారం మీద పేరాశతో మరొక పార్టీలో చేరి సభలో మెజారిటీని తారుమారు చేసే ఫిరాయింపుల నిరోధానికి 1985లో తీసుకు వచ్చిన చట్టం చేతగానితనం పదేపదే రుజువవుతున్నది.

శాసన సభా పక్షంలోని మూడింట రెండోవంతు సభ్యులు పార్టీని వీడ దలచినప్పుడు అది ఫిరాయింపుగా కాకుండా చీలికగా పరిగణన పొంది అలా చీలిన వర్గానికి ప్రత్యేక పార్టీగా గుర్తింపు లభిస్తున్నది. ప్రస్తుత మహారాష్ట్ర పరిణామాల్లో గవర్నర్, శాసనసభ స్పీకర్ పాత్రలు కీలకం కానున్నాయి. మహా వికాస్ అఘాది ఏర్పాటులో తన చాకచక్యాన్ని ప్రదర్శించిన మరాఠా వీరుడు శరద్ పవార్ ఇప్పుడేమి చేయగలుగుతారో చూడాలి. కేంద్రంలో అధికారంలో వుండి ప్రజాస్వామిక రాజ్యాంగ విలువలను కాపాడవలసిన భారతీయ జనతా పార్టీయే స్వలాభం కోసం రాష్ట్రాల్లో ఫిరాయింపులను, దొడ్డిదారి కూల్చివేతలను యింత ఘోరంగా ప్రోత్సహించడం దేశానికి పట్టిన దుర్గతిగా పరిగణించక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News