Monday, January 20, 2025

బిజెపి ‘మహా’ వ్యూహం!

- Advertisement -
- Advertisement -

Corona again in india చివరి నిమిషంలో హీరోను మార్చి ఏక్‌నాధ్ షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ద్వారా అపూర్వమైన రాజకీయ షాక్ ఇచ్చామని బిజెపి వ్యూహకర్తలు భావిస్తూ వుండవచ్చు. దేశ వాణిజ్య రాజధాని ముంబై ముఖ్య పట్టణంగా గల మహారాష్ట్రలో స్వయంగా అధికారం చెలాయించాలనుకొనే బిజెపి తన స్వార్థాన్ని త్యాగం చేసి షిండేకి కిరీటం తొడగడం వెనుక రహస్యం ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. అది భవిష్యత్తులో అతిపెద్ద లాభాన్ని ఆశించి చేసిన తాత్కాలిక త్యాగమే అని లోతుగా పరిశీలించేవారికి అర్థమవుతుంది. మహారాష్ట్ర ప్రత్యేక గుర్తింపును, అక్కడి ప్రజల అస్తిత్వాన్ని ప్రతిబింబించే పార్టీగా శివసేన వేళ్లూనుకున్నది. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే సారథ్యంలో హిందుత్వ ఊపిరిగా, రాజీలేని మొరటు ప్రాంతీయోన్మాద శక్తిగా, పదునైన కత్తిగా అది మనుగడ సాగించింది.

దాని కరడుగట్టిన హిందూత్వ సిద్ధాంతాల కారణంగానే బిజెపితో కలిసి నడిచింది గాని ప్రాంతీయ శక్తిగా దానికున్న గుర్తింపు అసాధారణమైనది. అందుచేతనే ఉద్ధవ్ థాక్రే మొన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ‘బాల్ థాక్రే కొడుకును గద్దె దింపారు’ అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు ముంబైలోని శివసేన తిరుగుబాటుదార్ల ఇళ్లపై ఆ పార్టీ సైనికులు దాడులు జరిపిన విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూచోబెడితే ఆ వర్గం తీవ్ర అసంతృప్తికి గురై తమ మీద కత్తి కడుతుందని, అది తమకు భవిష్యత్తు ఎన్నికల్లో తీవ్ర హాని చేస్తుందని బిజెపి నాయకత్వం భయపడింది. దాని నుంచి బయటపడడానికే ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసింది.

అంతేకాకుండా శివసేనను పూర్తిగా మట్టికరిపించి దాని పట్టులోని ప్రజలను తన వైపు ఆకట్టుకోవాలని, ఆ విధంగా మహారాష్ట్రలో ఏకైక హిందుత్వ పార్టీగా వెలిగిపోవాలని బిజెపి ఆశిస్తూ వుండవచ్చు. థాకరేల నాయకత్వంలో శివసేన కొనసాగినంత కాలం ఇది సాధ్యం కాదు. అందుచేత ఆ పార్టీ నాయకత్వాన్ని అనామకుల చేతిలో పెట్టడం ద్వారా తమ లక్షాన్ని సాధించుకోవచ్చని భావించారు. ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. ఇది ఎంత వరకు బిజెపికి ప్రయోజనం కలిగిస్తుందో ముందు ముందు అక్కడ జరిగే చిన్న, పెద్ద ఎన్నికలలో రుజువవుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో, మహారాష్ట్ర విధాన మండలి ఎన్నికల్లో ఫిరాయింపులు జరిపించి బిజెపి తన పబ్బం గడుపుకోడానికి, నేరుగా జరిగే ఎన్నికల్లో మెజారిటీ ప్రజల ఆమోదాన్ని పొందడానికి చాలా తేడా వుంది. ఏక్‌నాథ్ షిండేను గద్దె మీద కూచోబెట్టి తాను వెనుక సీటు డ్రైవింగ్ చేయడానికి బిజెపి నిర్ణయించుకున్నది. రెండున్నరేళ్ల పాటు సాగిన మహా వికాస్ అఘాది పాలన ఒక విలక్షణమైన ఘట్టం.

ఒకరికొకరికి ఎంత మాత్రం పొసగని శక్తులు కూడా కలిసి మన్నికైన పాలన అందించవచ్చని అది నిరూపించింది. శివసేనకు, ఈ కూటమిలోని మిగతా రెండు పార్టీలైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌లకు బొత్తిగా పడదు. సైద్ధాంతికంగా అవి పరస్పర విరుద్ధ ధ్రువాలు. వాటి కలయికతో ఏర్పడిన ప్రభుత్వం ఎంత కాలం కొనసాగుతుందనే అనుమానాలు మొదటి రోజునే పొడసూపాయి. అంతేకాకుండా ఆ కూటమి నిర్మాణానికి సంప్రదింపులు, సన్నాహాలు జరుగుతున్న దశలోనే బిజెపి దానిని విచ్చిన్నం చేసి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్‌ను చేరదీసి జరిపించిన తెల్లవారుజాము ప్రమాణ స్వీకార ప్రహసనం తెలిసిందే. అజిత్ పవార్‌పై గల ఆర్థిక నేరాల కేసులను ఉపసంహరించుకొని ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆశీస్సులతో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వం వెనువెంటనే కూలిపోయింది. శరద్ పవార్ చక్రం తిప్పి ఆ ఏర్పాటు జరిపించారన్న ప్రచారం ఊపందుకోడంతో ఆ అపఖ్యాతిని తొలగించుకోడం కోసం ఆయన హుటాహుటిన రంగ ప్రవేశం చేసి అజిత్ పవార్ వర్గాన్ని తిరిగి వెనుకకు రప్పించారు.

దానితో బిజెపి కుట్ర ప్రారంభంలోనే భగ్నమైంది. అప్పట్లో శరద్ పవార్‌పైనే కేంద్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఆయనను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని బిజెపి కేంద్ర నాయకత్వం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిజెపి మహా వికాస్ అఘాది ప్రభుత్వంలోని వారిపై వీలున్నప్పుడల్లా ఇడిని ప్రయోగించింది. ఆ కుట్రలన్నింటినీ తట్టుకొని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఇంత కాలం కొనసాగడం విశేషం. తనకు వీలైనంతగా జనహిత పాలనను అందించడం ద్వారానే అది ఇంత వరకు కొనసాగిందని భావించాలి. ముఖ్యంగా ముంబై నగరాన్ని కొవిడ్ 19 పట్టి పీడించిన సమయంలో ఉద్ధవ్ ప్రభుత్వం తనకు సాధ్యమైనంతగా దాని నుంచి ప్రజలను కాపాడిందనిపించుకున్నది. అందుకు అవసరమైన సాధన సంపత్తిని అందించకుండా సహాయ నిరాకరణ చేసిన కేంద్రంతో గట్టిగా పోరాడింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బిజెపి, శివసేన తిరుగుబాటు వర్గం ఉమ్మడి ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News