Wednesday, January 22, 2025

మహారాష్ట్రలో అనర్హత వేట్ల కలకలం

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో తిరిగి ఓసారి ఎమ్మెల్యేల అనర్హతల వేటు విషయం కలకలం రేపింది. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ శనివారం ఏకంగా 54 మంది ఎమ్మెల్యేలకు సంబంధిత విషయంపై నోటీసులు వెలువరించారు. షిండే నాయకత్వపు శివసేన వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు, 14 మంది ఉద్ధవ్ వర్గపు శివసేన ఎమ్మెల్యేలకు ఈ శ్రీముఖాలు పంపించారు. వీరికి వ్యతిరేకంగా అనర్హత పిటిషన్లు అందినందున వీరి వివరణకు ఈ నోటీసులు వెలువరిస్తున్నట్లు స్పీకర్ ఆ తరువాత తెలిపారు. వారం రోజుల వ్యవధిలో వీరు తమ వివరణలు ఇచ్చుకునేందుకు గడువు విధిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఇప్పుడు నోటీసులు పంపించిన వారిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన యుబిటి నేత ఆదిత్యా థాకరే కూడా ఉన్నారు.

అయితే గత ఏడాది శివసేన చీలిపోయిన తరువాత ఎన్నికైన శివసేన యుబిటికి చెందిన ఎమ్మెల్యే రుతుజా లత్కేకు నోటీసు వెలువరించలేదు. ముఖ్యమంత్రి షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్ల విచారణ త్వరలోనే జరుగుతుందని తమకు ఎన్నికల సంఘం నుంచి వర్తమానం అందిందని, ఇందులో శివసేన పుట్టుపూర్వోత్తరాల విషయం ప్రస్తావన ఉందని, అన్ని విషయాలను పరిశీలించుకుని సంబంధిత విషయంపై తాము ఈ ఎమ్మెల్యేలందరి వివరణకు గడువు ఇచ్చినట్లు స్పీకర్ తెలిపారు. అయితే తమకు ఎటువంటి నోటీసు అందలేదని ఈ పార్టీ ఎమ్మెల్యే , అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ తెలిపారు. ఉద్ధవ్ క్యాంప్‌లో ఆదిత్యా థాకరేతో పాటు 14మంది ఎమ్మెల్యేలపై షిండే సారధ్యపు శివసేన అనర్హత పిటిషన్లు దాఖలు చేసిందని వివరించారు.

తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ త్వరితగతిన విచారించేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఈ వారంలోనే శివసేన యుబిటి సుప్రీంకోర్టును కోరింది. అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని, రెండు నెలలుగా వీటిని తొక్కిపెట్టి ఉంచారని, అందుకే తాము న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు యుబిటి శివసేన నేత అర్వింద్ సావంత్ తెలిపారు. సుప్రీంకోర్టును తాము ఆశ్రయించడంతోనే ఇప్పుడు స్పీకర్ తేరుకుని ఇప్పుడు ఈ నోటీసులు వెలువరించారని పేర్కొన్నారు. కోర్టు ద్వారా తమ వర్గానికి తగు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 2022 జూన్‌లో అవిభక్త శివసేనకు చెందిన షిండే , 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి బిజెపితో చేతులు కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వెళ్లారు. దీనితో అప్పటివరకూ ఉన్న ఉద్ధవ్ ప్రభుత్వం కుప్పకూలింది. అయితే ఇప్పటికీ పలు సార్లు అనర్హత వేటు విషయం గురించి సుప్రీంకోర్టు నుంచి పలు సార్లు కీలక రూలింగ్‌లు వెలువడ్డా, విషయం పెండింగ్‌లోనే ఉంటూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News