పుణె/ముంబయి: మహారాష్ట్రలో అత్యంత సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కొనసాగిన పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ(పిడబ్లూపి) సీనియర్ నాయకుడు 94 సంవత్సరాల గణపత్‌రావు దేశ్‌ముఖ్ శుక్రవారం రాత్రి సోలాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మహారాష్ట్ర శాసనసభకు 11 పర్యాయాలు ఎన్నికైన గణపత్‌రావు 15 రోజుల క్రితం వృద్ధాప్యం వల్ల కలిగే అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారని, శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారని ఆయన మనవడు అనికేత్ దేశ్‌ముఖ్ శనివారం తెలిపారు.
సోలాపూర్ జిల్లాలోని సంగోలా నియోజకవర్గం నుంచి 1962 నుంచి 11 సార్లు గణపత్‌రావు మహారాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 54 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా సేవలందచేసిన గణపత్‌రావు 1972 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ 1974లో జరిగిన ఉప ఎన్నికలో అదే స్థానం నుంచి గెలుపొందారు. 1995లో కేవలం 192 వోట్ల తేడాతో ఆయన ఓడిపోయినట్లు అనికేత్ తెలిపారు. 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సంగోలా నుంచి 11వ సారి గెలుపొందిన గణపత్‌రావు 2019 వరకు పదవిలో కొనసాగారు.
1978లో శరద్ పవార్ మంత్రివర్గంలో, 1999లో విలాస్‌రావు దేశ్‌ముఖ్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్-ఎన్‌సిపి కూటమి ప్రభుత్వానికి పిడబ్లుపి మద్దతు తెలిపింది. సంగోలాలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. గణపత్‌రావు మృతి పట్ల ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంతాపం ప్రకటించారు.