జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన మహర్షి, జెర్సీ
జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్, మనోజ్ బాజ్‌పాయ్
ఉత్తమ నటిగా కంగనారనౌత్
67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమాలు మహర్షి, జెర్సీ సత్తా చాటాయి. ఈసారి నాలుగు జాతీయ స్థాయి అవార్డులు ఈ సినిమాలకు రావడం విశేషం. జాతీయ అవార్డులను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించారు. అలాగే ఇదే సినిమాకు గాను కొరియోగ్రాఫర్ రాజు సుందరం జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడు అవార్డు గెల్చుకున్నారు. ఇక నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మించిన ‘జెర్సీ’ సినిమాకుగాను జాతీయ ఉత్తమ ఎడిటర్ అవార్డు నవీన్ నూలికి లభించింది. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కూడా ‘జెర్సీ’ నిలిచింది.
67వ జాతీయ సినీ అవార్డుల జాబితాలో ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరు హీరోలు షేర్ చేసుకున్నారు. తమిళ నటుడు ధనుష్ ‘అసురన్’ సినిమాకు గాను.. మనోజ్ బాజ్‌పాయ్ ‘భోంస్లే’ సినిమాకు గాను ఉత్తమ నటులుగా అవార్డులు దక్కించుకున్నారు. ముఖ్యంగా ‘అసురన్’ సినిమాలో ధనుష్ కనబర్చిన నటన అద్భుతంగా ఉంటుంది. ఆయన గెటప్, బాడీ లాంగ్వేజ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఇక ‘మణికర్ణిక’, ‘పంగా’ సినిమాలకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు కంగనా రనౌత్‌ను వరించింది. ముఖ్యంగా ‘మణికర్ణిక’ సినిమాలో కంగనా చేసిన యాక్షన్ సన్నివేశాలు, ఆమె కనబర్చిన పౌరుషం ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే జాతీయ ఉత్తమ చిత్రంగా ‘మరక్కర్’(మలయాళం) నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా ‘బహత్తర్ హూరైన్’ సినిమాకు గాను సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్‌కు జాతీయ అవార్డు దక్కింది.