మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్ ఇజిఎస్) అమలు తీరులో ఎన్నో లోపాలు ఎత్తిచూపుతూ గత వారం గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఇదే విధంగా మంగళవారం రాజ్యసభ ఎంపి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా రాజ్యసభలో ఈ పథకంలోని లోపాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం కనిపించడం లేదు. బిజెపి అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరుతో పథకానికి తూట్లు పొడుస్తోంది. ఒకవిధంగా ఈ ఉపాధి పథకానికి ఊపిరి తీసేస్తోందని చెప్పడంలో తప్పేమీ లేదు. పార్లమెంటరీ కమిటీకి కాంగ్రెస్ ఎంపి సప్తగిరి శంకర్ ఉలాకా నేతృత్వం వహిస్తున్నారు.
గ్రామీణాభివృద్ధి విభాగానికి బడ్జెట్‌లో కేటాయింపులపై సమీక్ష సందర్భంగా గత బుధవారం దీనిపై కమిటీ సూచనలతో కూడిన నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ పథకం కింద రోజువారీ చెల్లిస్తున్న వేతనాల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఉదాహరణకు నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో రోజుకు రూ. 234 చెల్లిస్తుండగా, హర్యానా, సిక్కింల్లో రూ. 374 వరకు చెల్లిస్తున్నారు. ఈ వేతనాలు ప్రస్తుతం వ్యవసాయ కార్మికులకు కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగదారుల ధరల సూచిక)తో ముడిపెడుతున్నారు. అయితే ఈ సూచిక ద్రవ్యోల్బణం అసలు ప్రభావాన్ని గుర్తించడం లేదు.
అందువల్ల వేతనాలను లెక్కకట్టే పద్ధతిని సమీక్షించవలసిన అవసరం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రాధాన్యాలను పరిగణించి తాజాగా వేతనాలను నిర్ణయించడం తప్పనిసరి. ఈ పథకానికి ప్రధానంగా కేంద్రమే నిధులు కల్పిస్తున్నందున, అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే రీతిలో వేతనాలు చెల్లించడం న్యాయం. అలాగే ఈ పథకం కింద రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ఫిబ్రవరి 15 వరకు అందిన నివేదిక ప్రకారం ఈ వేతనాల బకాయిలు రూ. 12,219.18 కోట్లతో కలుపుకుని చెల్లించవలసి ఉన్న మొత్తం రూ. 23,446.22 కోట్లు వరకు ఉన్నాయని తేలింది. కేటాయించిన నిధుల్లో నాలుగోవంతు అంటే రూ. 86,000 కోట్లు వరకు గత ఆర్థిక సంవత్సరంలో పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికే సరిపోతుందని కమిటీ గుర్తు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్‌ను రూ. 62,553.73 కోట్ల వరకు తగ్గించారు. ఈ పథకం సామర్థాన్ని పరిమితం చేశారు.
పశ్చిమ బెంగాల్ విషయాన్ని పరిశీలిస్తే ఈ పథకం కింద కేటాయించాల్సిన నిధులు 2022 మార్చి వరకు అందలేదు. ఈ పథకం అమలులో అవినీతి జరుగుతోందన్న ఆరోపణపై కేంద్రం నిధుల కేటాయింపును ఆపేసింది. ఈ విధంగా నిధుల కేటాయింపు రద్దును కొనసాగించడం వల్ల తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. వలస కార్మికుల్లో అసంతృప్తి పెరిగి, వేరే చోటకు వలసలు సాగించడం రానురాను ఎక్కువవుతోంది. గ్రామీణాభివృద్ధి పనులకు అంతరాయం కలుగుతోంది. గ్రామీణ ప్రజల జీవితాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఈ పథకం నిధుల విషయంలో పశ్చిమ బెంగాల్‌లో కోర్టు వివాదంలో ఉన్న సంవత్సరం తప్ప మిగతా అర్హమైన అన్ని సంవత్సరాలకు తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సిందేనని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.
ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ 2005 లోని సెక్షన్ 27ను ప్రస్తావించిన తరువాత కేంద్రం ఈ పథకం నిధులను స్తంభింపచేయడం ప్రారంభించింది. ఈ సెక్షన్ 27 ప్రకారం పథకం అమలులో నిబంధనలను ఉల్లంఘిస్తే కేటాయించే నిధులను స్తంభింప చేసే హక్కు కేంద్రానికి ఉంటుంది.ఈ సాకుతో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో కేంద్రం బ్రేకు వేసింది. దీని వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా తయారయ్యాయి. ఈ పథకం నిధుల కేటాయింపులో కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలోను, పశ్చిమ బెంగాల్‌లోనూ ఆందోళనలు చేపట్టింది. ఈ పథకం కింద రావలసిన నిధులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి అనేక ఉత్తరాలు రాశారు.
ఇక చేసేది లేక రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడానికి కర్మశ్రీ అనే పథకాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రకటించారు. మంగళవారం (18 3 2025) రాజ్యసభలో సోనియా గాంధీ ఈ పథకం తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు రానురాను తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని, బడ్జెట్ కేటాయింపులు రూ. 86,000 కోట్ల వద్ద నిలిచిపోయాయని, ఇది జిడిపిలో పదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరిందని విమర్శించారు. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు బడ్జెట్ రూ. 4000 కోట్లు తగ్గుతుందని, కేటాయించిన నిధుల్లో దాదాపు 20% గత సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడానికి సరిపోతుందని స్పష్టం చేశారు.
అదనంగా ఈ చట్టం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిలో ఆధార్ ఆధారిత చెల్లింపు, నేషనల్ మొబైల్ మోనిటరింగ్ సిస్టమ్, వేతన చెల్లింపులో నిరంతర జాప్యాలు, ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేయడానికి సరపడా వేతన రేట్లు లేకపోవడం తదితర లోపాలను ఆమె బయటపెట్టారు. ఈ చట్టం కింద కనీస వేతనాలతోపాటు పని దినాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాన్ని రోజుకు రూ. 400కు పెంచాలని, ఏడాదికి హామీ ఇవ్వబడిన పని దినాల సంఖ్యను 100 నుంచి 150కి పెంచాలని డిమాండ్ చేశారు. అయినా అవన్నీ చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు తయారైంది.