Wednesday, January 22, 2025

కొన ఊపిరితో ఉపాధి హామీ!

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపు తగ్గించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గ్రామీణ, వ్యవసాయ కూలీలకు ఆర్థికంగా బాసట నిలిచిన ఈ పథకంపట్ల ఎన్‌డిఎ ప్రభుత్వానికి మొదటి నుంచి చిన్నచూపే ఉందనడానికి దాని కేటాయింపులే నిదర్శనం. 2020 -21లో రూ. 61500 కోట్లు, 2022-23లో రూ. 73000 కోట్లు కేటాయింపులుండగా, 2023 24లో మాత్రం రూ. 61032 కోట్లకు తగ్గించింది. వాస్తవానికి గత కేటాయింపుల్లో పెంపుదల ప్రకారం ఈ ఏడాది రూ. 89,400 కోట్లు రావలసిఉంది. ఈ లెక్కన మూడింట ఒకవంతు అనగా రూ. 28 వేల కోట్లు తగ్గినట్లుగా భావించాలి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ప్రకారం పౌరులకు పని చేసే హక్కుకు అనుగుణంగా పనిని కూడా ప్రభుత్వం కల్పించాలి. పని కల్పనను చట్టబద్ధ్దం చేస్తూ 2005లో ఆనాటి యుపిఎ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం గ్రామీణ కూలికి ఏడాదికి 100 రోజులు పని కల్పించాలి. కనీస వేతన చట్టాన్ని అనుసరించిన కూలి రేటు చెల్లించాలి.గ్రామాల్లో కూలి దొరకక ఇల్లు వదిలిపెట్టి గ్రామీణులు నగరాలకు వలస వెళ్లవద్దనే, జరిగే పనుల ద్వారా పల్లెల అభివృద్ధి కూడా సాధ్యపడుతుందనే లక్ష్యం తో ఇది కొనసాగుతోంది. పనుల ఎంపిక, నిధుల నిర్వహణ అధిక శాతం గ్రామ పంచాయతీల ద్వారానే జరుగుతుంది. ఉపాధి హామీలో పని చేయాలనుకొనేవారు గుర్తింపు కార్డు తీసుకోవాలి. కార్డుదారు అడిగిన 15 రోజుల్లో పని కల్పించాలి, లేని పక్షంలో ఆ కాలానికి నిరుద్యోగ భృతి చెల్లించాలని చట్టంలో ఉంది. స్థానిక వృత్తులతో పాటు వ్యవసాయానికి అనుబంధంగా ఇది గ్రామా ల్లో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా, ఆపత్కాల బంధువుగా పని చేస్తోంది. 100% కేంద్ర నిధుల ద్వారానే ఈ పథకం దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. కాంట్రాక్టర్ లేకుం డా, యంత్రాలు వాడకుండా గ్రామాల్లో నీటి సంరక్షణ, రహదారుల అభివృద్ధి లాంటి పనులు కేవలం శ్రమశక్తితో జరుగుతున్నాయి. గ్రామీణ అభివృద్ధికి తోడ్పడే ప్రాథమిక అవసరాలను ఇది తీర్చుతుందనవచ్చు.

గ్రామీణ ఉపాధి హామీలో పని కోసం దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ 100 రోజుల పని కల్పించాలంటే రూ. 2.72 లక్షల కోట్ల నిధులు అవసరం. కనీసం 40 రోజులకైనా రూ. 1.24 లక్షల కోట్లు కావాలి. ఈ ఏడాది కేటాయింపు అయిన రూ. 60 వేల కోట్లు అందరూ పని అడిగితే 20 రోజులకు మాత్ర మే సరిపోతాయి. అయితే బడ్జెట్ కేటాయింపు తగ్గుదలకు అనుకూలంగా ప్రభు త్వం వద్ద సమాధానాలున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సర్వే 2022- 23లో ఉపాధి హామీ నమోదు చేసుకొన్నవారిలో కేవలం 6.5 కోట్ల మంది మాత్రమే పని అడిగారని, అందులో 5.7 కోట్ల కూలీలు మాత్రమే పనులకు హాజరయ్యారని ఉంది. ఏడాదికేడాది పనులు జరుగుతూ ఉండడం వల్ల గ్రామాల్లో అవసరాలు తీరిపోతున్నాయని ఆ సర్వేలో ఉంది. గ్రామాభివృద్ధి కారణంగా గ్రామాల నుండి పట్టణాలకు వలసలు కూడా తగ్గాయని జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు చెబుతున్నాయి. వలసలు తగ్గినా, గ్రామాభివృద్ధి జరిగినా చట్ట ప్రకారం అడిగినవారికి 100 రోజుల కూలి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

పనులు చేసే ప్రాంతంలో పసి పిల్లల సంరక్షణకు ఏర్పాట్లు, తగు నీటి వసతి, సేద తీరేందుకు నీడ కల్పించాలి. నివాసానికి 5 కి.మీ. పరిధిలో పని చూయించాలి. పని పూర్తయిన వారం రోజుల్లో కూలి చెల్లింపు జరగాలి. వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. చెల్లింపుల్లో నెలల తరబడి ఆలస్యమైనా సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ విపరీత జాప్యం వల్ల కూలీలకు ఈ పనుల పట్ల ఆసక్తి తగ్గిందని పరిశీలకులు అంటున్నారు. 15 రోజుల్లో పని చూయించని పక్షంలో భృతి చెల్లించిన దాఖలాలు అసలే లేవు. మరోవైపు ఈ పనుల నిర్వహణ, ఫలితాలపట్ల విమర్శలు కూడా ఉన్నాయి. నకిలీ కార్డులతో పనివారి సంఖ్య పెంచుతున్నారని, పనికిరాని వారి పేరిట కూడా బిల్లులు తీసుకొంటున్నారని వార్తలు వచ్చాయి. పను ల్లో కూడా నాణ్యత కొరవడుతుందనే రుజువులున్నాయి.

అయితే ఇవన్నీ అధికారుల అవినీతి, అలసత్వం, పర్యవేక్షణ లోపాల ఫలితమే తప్ప ఇందులో కూలీల తప్పు ఏమీ లేదనవచ్చు. ఈ పనుల వల్ల పంటల సమయంలో కూలీల కొరత ఏర్పడుతుందని సాగు రైతులంటున్నారు. ఉపాధి హామీ పను లు పంటలకు అడ్డు రాకుండా చూసుకోవాలి. పని కల్పన ద్వారా గ్రామీణ అభివృద్ధితో పాటు పేదరికాన్ని తగ్గించడానికి దోహదపడుతున్న ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. 2000 లో మన దేశంలో 23% ఉన్న గ్రామీణ వలసలు ఇప్పుడు దాదాపు పూర్తిగా తగ్గిపోయాయని ఐక్యరాజ్య సమితి కూడా అంటోంది. దేశ పౌరులకు ఉన్న పని చేసే హక్కును గౌరవిస్తూ పనిని కల్పించే బాధ్యత ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్దేశిత కర్తవ్యం.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News