Monday, December 23, 2024

ఊపిరి లేని ‘ఉపాధి హామీ’

- Advertisement -
- Advertisement -

పల్లెల్లోని నిరుపేదలకు ఉపాధి కల్పించి వారి జీవన వ్యయానికి లోటు లేకుండా ఆసరా కల్పించాలన్న ప్రధాన లక్షంతో ఆనాటి యుపిఎ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) నిర్వీర్యం అయ్యేలా ప్రస్తుత మోడీ ప్రభుత్వం విధానాలు ఉంటున్నాయి. ఆధార్ అనుసంధానం చేయడంతో చాలా వరకు ఉపాధి కల్పన తగ్గిపోయిన ఉదంతాలు కనిపిస్తుండగా ఇప్పుడు ఈ పథకంలో నిరుద్యోగ భృతి అన్న అంశాన్ని ప్రవేశపెట్టి విధానాలను లోపభూయిష్టంగా అమలు చేస్తున్నారు. మొత్తం 25.25 కోట్ల మంది నమోదైన ఉపాధి హామీ కార్మికులు కాగా, వారిలో ఆధార్ కార్డు ఉన్న వారు 14.35 కోట్ల మంది మాత్రమే ఉంటారని తెలుస్తోంది.

మిగతా అసలు కార్మికులైన జాబ్‌కార్డులు గలవారి సంగతి ప్రశ్నార్థకంగా మారింది. ఆధార్ ఉన్నవారికే ఈ పథకం ద్వారా ఉపాధి పనులు ఇవ్వాలని 2022 ఏప్రిల్ నుంచి రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది. ఫలితంగా ఈ పథకం నుంచి ఆధార్ కార్డు లేని 7.6 కోట్ల మంది తప్పుకోవలసి వచ్చింది. కేంద్రం ఆధునిక సాంకేతికతలను ప్రయోగించడం ద్వారా 2023 నాటికి ఈ పథకం క్షీణస్థితికి దిగజారింది. అంతేకాదు 2023 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి అతి తక్కువగా రూ. 60 వేలు కోట్లే కేటాయించారు. ఈ విధంగా రానురాను బడ్జెట్‌లో కేటాయింపులు పలచబడిపోవడంతో వందరోజులు పని కల్పించడానికి బదులు 16 రోజులకు మాత్రమే పనులు అప్పగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పథకం అమలు పారదర్శకంగా ఉండాలన్న నెపంతో నిరుద్యోగ భృతి అన్న అంశాన్ని ఈ పథకంలో ఇమిడ్చారు.

దీనికి కూడా నిధుల కేటాయింపు కంటితుడుపుగా ఉంటున్నాయి. 202324 కు సంబంధించి వివిధ రాష్ట్రాలకు కేవలం రూ. 90,000 మాత్రమే నిరుద్యోగ భృతి కింద కేటాయించారు. అది కార్మికులకు పనిలేనప్పుడే అందజేస్తారు. అదే 202223లో రూ.7.8 లక్షలు కేటాయించారు. 2024 ఆర్థిక సర్వే పార్లమెంట్‌లో జులై 22న సమర్పించిన నివేదికలో ఈ గణాంకాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని, పనిలేని దినాల డిమాండ్‌కు సంబంధించి వాస్తవ సంఖ్యను ప్రతిబింబించడం లేదని వ్యాఖ్యలు వచ్చాయి. లబ్ధిదారులకు తరచుగా కావలసిన పని అందడం లేదని, పనికి ఉన్న డిమాండ్‌ను కచ్చితమైన సమయాల్లో బ్లాక్ స్థాయి అధికార యంత్రాంగం రిజిస్టర్ చేయడం లేదని సర్వే వెల్లడించింది. తత్ఫలితంగా అధికారిక డేటా ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పనుల వాస్తవ డిమాండ్‌ను ప్రతిబింబించకపోవచ్చని నివేదిక పేర్కొంది.

ఈ పథకంలో రిపోర్టింగ్ లోపాలను కూడా ఎత్తి చూపింది. ఉపాధి వాస్తవంగా కల్పించినప్పుడు మాత్రమే పని డిమాండ్ పోర్టల్‌లో రిపోర్టు చేయడమవుతోంది. బహుశా నిరుద్యోగ భృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడానికి కావచ్చు. ఈ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ 2005 పథకం లోని సెక్షన్ 7(1) ప్రకారం ఈ పథకం కింద ఎవరైనా ఉపాధి కోసం దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోగా వారికి ఉపాధి కల్పించలేనప్పుడు ఆ వ్యక్తికి రోజువారీ నిరుద్యోగ భృతిని చెల్లించవలసి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో మొదటి 30 రోజుల పాటు వేతనం రేటులో నాలుగో వంతు చెల్లించాలి. మిగతా కాలానికి సగానికి సగం చెల్లించాలి. అయితే ఈ చట్టం అమలుకు ప్రధాన సమస్య నిరుద్యోగ భృతికి నిధుల కేటాయింపు చాలా తక్కువ కావడం. 202223, 202324లో కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే నిరుద్యోగ భృతిని చెల్లించాయి.

అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో 202122, 202021లో కేవలం మూడు, నాలుగు రాష్ట్రాలు క్రమంగా నిరుద్యోగ భృతిని చెల్లించాయి. 2019 20లో ఏ రాష్ట్రం నిధులను చెల్లించలేదు. అయితే గ్రామీణ ఉపాధి పథకం కార్డు హోల్డర్లు నిరుద్యోగ భృతి అందుకోలేకపోవడానికి ముఖ్య కారణం తమ డిమాండ్‌కు సంబంధించిన రిజిస్టరింగ్ రశీదును తీసుకోకపోవడమేనని తెలుస్తోంది. ఈ విషయంలో బ్లాక్ స్థాయి అధికార యంత్రాంగం అసమర్థతే అన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ పథకానికి బడ్జెట్‌లో కేంద్రం చేసిన కేటాయింపులకు, లబ్ధిదారులకు మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా నలిగిపోవడాన్ని చూస్తుంటాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమర్పించిన నివేదికలో కేంద్రం ఈ విషయాన్ని ఉన్నత స్థాయిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించి తగిన నిధులు కేటాయించడంతో పాటు సరైన మార్గదర్శకాలు విధిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి కల్పించడంలో తమ రాజ్యాంగపరమైన విధుల నిర్వహణలో విఫలం కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ పరిశీలిస్తే ఉపాధి పథకం అసలు లక్షానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పొగపెట్టడమే కాకుండా ఊపిరి తీసేస్తున్నట్టు కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News