Tuesday, December 3, 2024

లక్షల మందికి ‘ఉపాధి’ సున్నా

- Advertisement -
- Advertisement -

దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతున్న దశలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) నుంచి 39 లక్షల మందిని తొలగించడం వివాదంగా మారింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఎన్‌జిఒ సేకరించిన డేటా ప్రకారం 45.5 లక్షల మందిని చేర్చుకోడానికి బదులు 84.8 లక్షల మందిని తొలగించినట్టు వెల్లడైంది. అంతేకాదు క్రియాశీలక కార్మికులు 8 శాతం మంది ఈ పథకం నుంచి వెనక్కు తగ్గారని ఈ వెబ్‌సైట్ ద్వారా తేలింది. దీన్ని బట్టి గత ఏడాదితో పోల్చి చూస్తే లబ్ధిదారులు చాలా తక్కువ మందే ఇప్పుడు ఈ పథకంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ స్కీమ్ జాబ్ కార్డ్ డేటాను కఠినంగా పరిశీలించడం నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఏ జాబ్ కార్డునైనా రద్దు చేయడానికి కట్టుదిట్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఉదాహరణకు జాబ్ కార్డు నకిలీదైనా లేదా డూప్లికేట్ అయినా లేదా లబ్ధిదారులు ఎవరైనా సజీవంగా లేకపోయినా, ఆయా జాబ్ కార్డులను తొలగించవచ్చు. ఆయా కుటుంబాలు ఇందులో ఎక్కువ కాలం పనిచేయడానికి ఇష్టపడకపోయినా లేదా లబ్ధిదారులు ఎవరైనా తమ గ్రామ పంచాయతీ నుంచి వేరే చోటకు చక్కని ఉపాధి కోసం తరలివెళ్లినా, వారు జాబ్ కార్డులను కోల్పోతారు. కానీ ఇక్కడ ఆందోళనకరమైన విషయమేమంటే పొరపాటున కార్డులను రద్దు చేయడం.

కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 15% వరకు పొరపాటున జాబ్ కార్డులను రద్దు చేశారు. ఎన్‌జిఒ ‘లిబ్‌టెక్ ఇండియా’ అధ్యయనంలో ఇది వెల్లడైంది. డేటా ప్రక్షాళనలో భాగంగా ఈ పొరపాటు జరిగింది. ఫలితంగా ఈ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద ఉపాధి అవకాశాలు గత ఏడాది ఇదే కాలంలో 184 కోట్ల వ్యక్తిగత పని దినాలు ఉండగా, ఈ ఏడాది 154 కోట్ల పనిదినాలకు తగ్గిపోయాయి. మరో విధంగా వివరించాలంటే ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో వ్యక్తిగత పనిదినాలు 16.6% వరకు తగ్గిపోయాయి. దీనికి విరుద్ధంగా 2022-23 మధ్య ఇదే కాలంలో వ్యక్తిగత పనిదినాలు 10% వరకు అంటే 166 కోట్ల వరకు పెరగడం గమనార్హం. 202324 పూర్తి ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత పని దినాలు 309.01 కోట్ల వరకు పతాక స్థాయిలో నమోదయ్యాయి.

అంతకు ముందు సంవత్సరం 202021 లో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న కాలంలో 389.09 కోట్ల పని దినాలు నమోదయ్యాయి. మరో ఆందోళనకరమైన పరిణామం ఏమంటే దేశం మొత్తం మీద దాదాపు 6.7 కోట్ల మంది కార్మికులు కేవలం ఆధార్ కార్డు లేని కారణంగా ఈ పథకానికి అనర్హులు గానే మిగిలిపోతున్నారు. ఈ పథకం కింద నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి జనవరి 1 నుంచి ఆధార్ ఆధారిత వేతనాల చెల్లింపు వ్యవస్థ (ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్)ను ప్రవేశపెట్టారు. ఈ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ గ్రామీణ భారతంలో ఈ విధానం ఒక సవాలుగా మారింది. కాగితాల మీద మాత్రం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఈ పథకానికి ఏమాత్రం అడ్డంకి కాదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో చూస్తే ఇదే పెద్ద అడ్డంకిగా నడుస్తోంది. ఎబిపిఎస్‌తో పాటు అనేక కారణాల వల్ల పేద ప్రజలు ఈ పథకం నుంచి లబ్ధిపొందలేని పరిస్థితి దాపురించింది. అసలు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ పథకం వివాదాలమయమై నీరుగారిపోతోంది.

ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఉపాధి పథకం అస్తవ్యస్తంగా ఉందన్న ఆరోపణలతో కేంద్రం నిధులు కేటాయించడం ఆపేసింది. ఈ మేరకు 2022 మార్చి 9న ఉత్తర్వు జారీ చేసింది. అనుకోకుండా నిధులు ఆపేయడంపై పశ్చిమబెంగాల్ ఉపాధి కార్మికుల్లో ఆందోళన తీవ్రమైంది. దీనిపై 2024 సెప్టెంబర్ 24న కలకత్తా హైకోర్టు ఈ పథకం అమలులో లోపాలు ఉన్నప్పటికీ కొనసాగించడం తప్పనిసరి అంటూ తీర్పు వెలువరించింది. ఏదేమైనా నిధులు ఆపేయడం 20212022, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. కొవిడ్19 తరువాత పశ్చిమబెంగాల్ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ఉపాధి కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో 12%, జార్ఖండ్‌లో 20% వరకు కార్మికులు తగ్గిపోయారు.

పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఆ కాలంలో క్రమంగా 82%, 100% వరకు కార్మికుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. జార్ఖండ్ రాష్ట్రం కూడా ఉపాధి నిధుల మంజూరులో జాప్యంతో అల్లాడుతోంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యంలో శిక్షణ ఇప్పిస్తామని, ప్రైవేట్ సంస్థల్లో వారికి ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ పథకం నిధుల మంజూరులో వివక్ష చూపించడం గ్రామీణ నిరుద్యోగులపై గొడ్డలివేటు పడినట్టే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News