మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందుగా నాటి స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలేను కలుస్తారు. ఆ సందర్భంగా ముందుగా పాదయాత్ర చేపట్టి అన్ని కులాలు, వర్గాల ప్రజలను కలవమని ఆయనకు సలహా ఇచ్చారు. పైగా, పాదయాత్ర సందర్భంగా ‘నోరు మూసుకుని’ ఉంచండి, వ్యక్తులను మాట్లాడనివ్వండి, వారికి ఉపన్యాసాలు ఇవ్వకండి ఎందుకంటే మీరు వారి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేరు. సామాన్యులు మీకు చాలా చెప్పాలి అంటూ సున్నితంగా హెచ్చరించారు. ఆయన మాటలను బాపు నియమబద్ధంగా అనుసరించారు. దేశం నలుచెరువులా పర్యటించి సాధారణ ప్రజలలో మమేకమై వారి మనస్సుల నుండి వలసరాజ్య భయాన్ని తొలగించి మొదటి ప్రజా నాయకుడుగా ఆధునిక భారత చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పటి వరకు నాయకులంటే బహిరంగ సభలలో ఉపన్యాసాలు ఇచ్చివెళ్లిపోయేవారే.
ఈ యాత్ర భారతదేశాన్ని, భారతీయులను దగ్గరి నుండి అర్థం చేసుకోగలిగేలా చేసింది. అప్పటికే పలు దశాబ్దాలుగా దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రూపాలలో స్వాతంత్య్ర ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు జరుగుతున్నా ఈ ఉద్యమాలలో సాధారణ ప్రజలను భాగస్వాములను కావించే ప్రక్రియ గాంధీజీతోనే ప్రారంభమైనది. ఎందుకంటే ప్రజానాయకుడు అంటే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లిపోయే వారిని నాయకులని అనలేము. ఈ విధంగా భారత దేశంలో ఓ నూతన ప్రజాస్వామ్య పోరాట చరిత్ర 1920లలో గాంధీజీతో ప్రారంభమైనదని చెప్పవచ్చు. 1947లో భారతదేశం నుండి వలస రాజ్యాల ఉపసంహరణ వరకు అది కొనసాగింది. ఆ తర్వాత 1950లో రాజ్యాంగబద్ధ పరిపాలన ప్రారంభం కావడం మరో ఘనమైన దశ. అప్పటికీ చాలా అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలలో కూడా లేని విధంగా సార్వత్రిక ఓటు హక్కు వయోజనులు అందరికీ కల్పించి చరిత్ర సృష్టించాము.
ఆ తర్వాత 1980వ దశకంలో దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం మరో నూతన చరిత్ర. కేవలం జాతీయ పార్టీలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించలేవని, భిన్నత్వంలో ఏకత్వంకు నిదర్శనంగా భావించే భారత దేశంలో వివిధ ప్రాంతాలలోని ఆకాంక్షలు, అవసరాలు, అభిలాషలకు అనువైన పరిపాలన, రాజకీయాలు అవసరం అనే గుర్తింపు ప్రారంభమయింది. అందుకనే జాతీయ రాజకీయ పార్టీలు సహితం అప్పటి నుండి తమ రాజకీయ మనుగడ కోసం పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఏర్పర్చుకోవడంతో పాటు, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమ విధానాలు రూపొందించుకోవడం ప్రారంభమైనది. ప్రజలలో ఇటువంటి రాజకీయ చైతన్యం కలిగించిన మూలపురుషుడు గాంధీజీ అని చెప్పవలసిందే.
అయితే గాంధీజీ నిఖార్సయిన జాతీయవాది. గాంధేయ జాతీయవాదం అందరినీ కలుపుకొని పోవాలని సూచిస్తుంది. తమ దేశంపై ఉగ్రదాడి సందర్భంగా అప్పటివరకు పట్టించుకోని ఉగ్రవాదంపై అకస్మాత్తుగా మేల్కొన్న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ‘ఉగ్రవాదంపై యుద్ధం’ ప్రకటించారు. ‘ఈ యుద్ధంలో నాతో ఉన్నవారు ఉగ్రవాదంతో పోరాడుతున్నట్లు, నాతో లేనివారు ఉగ్రవాదంపై మద్దతుదారులు’ అనే విచిత్ర ధోరణి వ్యక్తం చేశారు. నేడు దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి సంకుచిత ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. కీలకమైన జాతీయ ప్రాముఖ్యత గల అంశాలపై ఉమ్మడిగా కార్యాచరణ జరపడం గురించి ఆలోచించడమే లేదు. అందుకనే గాంధీజీ ‘ఇతరులు’, ‘లోపలి శత్రువులు’ అంటూ ఎవ్వరు లేరని పేర్కొనడం ద్వారా వైవిధ్యం పట్ల సహనాన్ని, గౌరవాన్ని ప్రదర్శించేవారు.
1931లో గాంధీ ‘యంగ్ ఇండియా’ లో ఇలా రాశారు, ‘స్వరాజ్ మెజారిటీ కమ్యూనిటీ అంటే హిందువుల పాలన అని చెబుతున్నారు. ఇదే నిజమైతే నేను దానిని స్వరాజ్యం అని పిలవడానికి నిరాకరిస్తాను…. నా దృష్టిలో హింద్ స్వరాజ్యం అంటే, ప్రజలందరి పాలన, న్యాయబద్ధ పాలన’ అని స్పష్టం చేశారు. జర్మన్ ఆర్థికవేత్త ఎర్నెస్ట్ షూమేకర్. తన పుస్తకం ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ పుస్తకంలో గాంధీని ‘ప్రజల ఆర్థికవేత్త’ గా అభివర్ణించాడు. గాంధీజీ అటు పెట్టుబడిదారీ విధానం, ఇటు కమ్యూనిజాన్ని తిరస్కరించారు. భారతీయ ఆలోచనలకు నెలవైన ‘ట్రస్టీ షిప్’ సిద్ధాంతం ప్రతిపాదించారు. ఈ ఆలోచనలనుండే ‘గ్రామ స్వరాజ్’ అనే విధానం వెలువడింది. అయితే ఆయన ప్రతిపాదించిన ఆర్ధిక నమూనాలను స్వాతం త్య్రం తర్వాత, నిత్యం ఆయన నామస్మరణ చేస్తూ పరిపాలన చేస్తున్న నేతలు గాలికి వదిలివేశారు. కానీ కేవలం ఇద్దరు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు జెఆర్‌డి టాటా, జమ్నాలాల్ బజాజ్ ‘ధర్మ కర్తృత్వ’ విధానం స్వీకరించడమే గాక, ఆచరించారు.
గాంధీకి ప్రజాస్వామ్యం కేవలం విధానపరమైన ప్రక్రియ కానేకాదు. అదొక్క వాస్తవికంగా స్వప్నం. ఆయన ప్రవచించిన అహింస, స్వేచ్ఛలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంపై ఉపయుక్తమైన వాస్తవిక విధానం. ప్రజలందరికీ సమానమైన సామాజిక వ్యవస్థను, న్యాయాన్ని అందించే సామర్ధ్యం కలిగిన శక్తివంతమైన ఆయుధం కూడా. నేడు ఉదారవాదం పేరుతో చెబుతూ ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ భావనకన్నా మహోన్నతమైన వ్యవస్థను ఆయన సూచించారు. విభేదాలు, సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు, సమాలోచనలు పద్ధతిపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. సంప్రదింపులు చేయడం ద్వారా ఇతరుల ముందు మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది కానీ, మిమ్ములను బలహీనులను కావించదని ఈ సందర్భంగా గాంధీజీ స్పష్టం చేశారు.
పాలకులు బలవంతంగా ప్రజలపై విధానాలను రుద్దే ప్రయత్నం చేయడం కన్నా, సంప్రదింపుల ద్వారా, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా నిర్ణయాలు తీసుకొని, అమలుకు ప్రయత్నిస్తే శాశ్వత ప్రభావం చూపగలవని గాంధీజీ చెప్పిన మాటలు నేడు అహంకారంతో, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పాలకులకు మార్గదర్శి కాగలదు. మన దేశ ప్రజలు 75 ఏళ్ళ అనంతరం కూడా ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానత, నిరుద్యోగం, పారిశ్రామికీకరణ, వివక్ష వంటి జటిల సమస్యల తీవ్రత ప్రమాదాలను గాంధీ ముందుగానే గుర్తించారు. ఈ అంశాలలో మన పాలకులు గాంధీజీ బోధనలను అనుసరించే ప్రయత్నం చేయకుండా, పాశ్చాత్య ప్రభావాలకు లోనవడమో, విదేశీ వత్తిడులకు లొంగడమో కారణంగా ఇటువంటి సవాళ్ళను పరిష్కరించుకోలేకపోతున్నాము.
దాదాపు అన్ని సామాజిక రంగాల పట్ల నిర్దుష్టమైన అభిప్రాయాలను, విశ్వాసాలను గాంధీజీ వ్యక్తం చేసేవారు. ఆయా విషయాలపై ఇతరులతో నిర్మోహతకంగా, పారదర్శకతతో సమాలోచనలు జరపడానికి కూడా సిద్ధపడేవారు. సైద్ధాంతికంగా తనను తీవ్రంగా వ్యతిరేకించిన నేతాజీ, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వంటి నాయకులతో సహితం సుదీర్ఘంగా సమాలోచనలు జరపడానికి ఎన్నడూ వెనుకంజ వేయలేదు. అటువంటి పారదర్శకత, వివిధ అభిప్రాయాలు గల వారితో సమాలోచనలు జరప గల సామర్ధ్యం మన ప్రస్తుత తరం నాయకులలో కనిపించడం లేదు. ఎంతో బలమైన, ప్రజాదరణ గల నాయకులుగా పేరొందిన ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, వాజపేయి వంటి వారు సహితం కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోబోయే ముందు రాజకీయ ప్రత్యర్థులను విశ్వాసంలోకి తీసుకొనేవారు. కానీ నేడు అటువంటి రాజకీయ ప్రక్రియలు కనుమరుగవుతున్నాయి.
గాంధీజీ ఆలోచనలకు మనం ఎంత దూరంగా జరిగిపోతున్నామో ఇటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలలో ఎక్కువ సీట్లు పొందినవారు పరిపాలన మాత్రమే కాదు. ప్రజానీకాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలి. అందుకు ముందుగా వారి ప్రతినిధులకు సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించాలి. కానీ నేడు చట్టసభలు మొక్కుబడిగా సమావేశాలు జరుపుతున్నాయి. మంత్రులకు సహితం విధానపరమైన అంశాలపై స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతర్గతంగా సహితం చర్చలకు అవకాశం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అర్ధాంతరంగా కీలక నిర్ణయాలు తీసుకొంటున్నాము. ఇవ్వన్నీ గాంధీజీ మనకు చూపిన ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్నటువంటివే అని చెప్పాల్సిందే.
* చలసాని నరేంద్ర- 9849569050