హైదరాబాద్ : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఓ ప్రకటనలో పూలే చేసిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. 1890 ఏప్రిల్ 11న జన్మించిన మహనీయుడు జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్, బాలహత్య ప్రతిబంధక్ గ్రుహాలయం, సేవాసదనం వంటి సంస్థల్ని నెలకొల్పి వాటి ద్వారా బహుజనుల, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసారని కొనియాడారు.
దీనబంధు పత్రికతో పాటు గులాంగిరి, సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్, సత్యసారాంశం వంటి గొప్ప రచనలతో సమాజంపై తనదైన ప్రభావం చూపారన్నారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేని చదివించడంతో పాటు ఆమెనే ఉపాద్యాయురాలిగా 1848లోనే తొలి బాలికా పాఠశాలను నెలకొల్పారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పూలే సిద్దాంతాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు, బిసిలకు ఆ మహనీయుని జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రాష్ట్రవ్యాప్తంగా జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.