ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం హట్టిగూడలో గురువారం 432 మంది ఇళ్లు లేని నిరుపేదలకు 2వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు లేని విధంగా జిహెచ్ఎంసి పరిధిలోని నిరుపేదలకు ధనవంతుల ఇళ్ల తరహాలో రూ.10వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మించి ఇస్తున్నారని అన్నారు.
తొలి విడతలో 11,700 అందివ్వగా, 2వ విడతలో 9 ప్రాంతాల్లో 13,200 ఇళ్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 23,300 ఇళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. జిహెచ్ఎంసి పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లా పరిధిలో 23,260 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో 9872, మహేశ్వరం నియోజకవర్గంలో 9892, రాజేంద్రనగర్ లో 696, ఎల్బీనగర్ లో 944, చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లిలో 1512, శేర్లింగంపల్లిలో 344 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని మంత్రి చెప్పారు.