Saturday, December 21, 2024

తెలంగాణలో ఏర్పడబోయేది డబుల్ ఇంజన్ సర్కారే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏర్పడబోయేది డబుల్ ఇంజన్ సర్కారేనని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మికృష్ణ గార్డెన్‌లో జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన కొత్త ఓటర్ల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ… గతంలో దేశంలో మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అస్సాం, త్రిపుర తదితర రాష్ట్రాలలో ప్రతి ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడేవని, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అత్యధిక మెజార్టీతో రెండు, మూడవ పర్యాయాలు కూడా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌తో అత్యధిక ప్రయోజనం పొందుతున్నారని ఆయన తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.535 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం కింద 883 కోట్ల 33 లక్షల నిధులు, కరోనా మహమ్మారి విపత్తుతో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి ద్వారా ఎలాంటి బ్యాంకు షరతులు లేకుండా ప్రతి వ్యాపారికి పదివేల చొప్పున 12,864 మంది వ్యాపారులకు 12 కోట్ల 85 లక్షలు వీధి వ్యాపారులకు అందజేయడం జరిగిందని, 320 కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 6100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని, దాదాపు 15 ఏళ్లుగా కొల్లాపూర్ ప్రజల చిరకాల స్వప్నమైన సోమశిల కృష్ణానది బ్రిడ్జి ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో 11 వేల కోట్లతో అత్యాధునికమైన మోడల్ వంతెన త్వరలోనే నిర్మాణం కాబోతుందని, దీనివల్ల ఆంధ్ర, తెలంగాణ మధ్య 100 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని ఆయన అన్నారు.

తాజాగా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఎంపీలు అధికార యంత్రాంగం పూర్తిగా కుమ్మక్కై ఓటు ఆరువేల రూపాయలు పంచినా చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా పదివేల మెజార్టీతో గెలిచాడని దీని ద్వారా తెలంగాణరాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని క్షేత్రస్తాయిలో పార్టీని బలపరిచి రానున్న ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్రమోడీకి కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

Mahendra Nath Pandey speech at new voters meeting in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News