గ్లోబల్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై సినీ ఇండస్ట్రీలో అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి వండర్స్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో ప్రపంచ స్థాయి అడ్వెంచర్ డ్రామా చేయబోతున్నాడు. ఇది మహేష్ కెరీర్‌లో 29వ చిత్రం కావడం విశేషం. జక్కన్న మార్క్‌తో డిజైన్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై అధికారికంగా పెద్దగా అప్‌డేట్స్ అయితే రాలేదు. ఓవైపు షూటింగ్ ముందుకు సాగుతుండగా, మరోవైపు అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలో డిమాండ్స్ పెరిగిపోతున్నాయి.
ఇలాంటి టైమ్‌లోనే ఇప్పుడు ఓ క్రేజీ బజ్ హల్‌చల్ చేస్తోంది. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ నుంచి గ్లింప్స్ వీడియోను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన లుక్, లోకేషన్ ఫోటోలు కాకుండా.. ఇప్పుడు మేకర్స్ రాజమౌళి దృష్టిలో ఉన్న స్పెషల్ విజన్‌ను చూపించేందుకు ఓ కసరత్తు చేస్తున్నారట. ఈ గ్లింప్స్‌లో మహేష్ లుక్‌తో పాటు సినిమాలో ఉండే అడ్వెంచర్ ఎలిమెంట్స్‌ని చూపించబోతున్నారని తెలిసింది. ఈ గ్లింప్స్ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం జూన్ లేదా జూలైలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటివరకు ఏ పాత్రలో కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించనున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
ఆయన పాత్ర ప్రపంచ యాత్రికుడిగా ఉండబోతుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్ సమర్పణలో కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇక మహేష్‌బాబు ఇటలీ వెకేషన్ నుంచి మంగళవారం హైదరాబాద్‌కు కుటుంబంతో కలిసి తిరిగి వచ్చారు. అదేవిధంగా రాజమౌళి కూడా ఇటీవలే జపాన్ వెళ్లారు. ఆయన కూడా వచ్చాక ఈ సినిమా మరో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఒడిశాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.