‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. గుంటూరు మిర్చిలా ఉన్నాడంటూ అభిమానులు మురిసిపోయారు. వెండితెరపై వింటేజ్ మహేష్ ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న ‘ఎస్ఎస్ఎంబి 28’ టైటిల్ ని, గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించినప్పటి నుంచి అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఇందులో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. బుధవారం నాడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో ‘ఎస్ఎస్ఎంబి 28’ టైటిల్, గ్లింప్స్ విడుదల వేడుక వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ అభిమానుల కేరింతల నడుమ, అభిమానుల చేతుల మీదుగానే సాయంత్రం 6:03 గంటలకు ‘మాస్ స్ట్రైక్’ పేరుతో గ్లింప్స్ ను విడుదల చేశారు.
మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ కి ‘గుంటూరు కారం’ అనే శక్తివంతమైన టైటిల్ పెట్టారు. టైటిల్ ని బట్టి చూస్తే, ఇది గుంటూరు నేపథ్యంలో రూపొందుతోన్న యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. టైటిల్ ని వెల్లడిస్తూ విడుదల చేసిన ‘మాస్ స్ట్రైక్’ అంచనాలకు మించి ఉంది. మహేష్ చిటికెతో గ్లింప్స్ ప్రారంభమైంది. కర్రసాముతో రౌడీ గ్యాంగ్ ని చితక్కొడుతూ ఆయన అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా ధరించి, తలకి ఎర్ర కండువా చుట్టుకొని ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేష్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నారని స్పష్టమైంది. నోటిలో నుంచి బీడీని తీసి, దానిని స్టైల్ గా వెలిగించి “ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ 3D లో కనపడుతుందా” అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలాగే ఫిదా చేశారు మహేష్. భారీ బ్లాస్ట్ తో జీప్ గాల్లో ఎగరగా, మహేష్ తన కాలి దుమ్ముని దులుపుకొని నడుస్తున్నట్లుగా వీడియోని ముగించిన తీరు మెప్పిస్తోంది. అలాగే తమన్ నేపథ్యం సంగీతం కట్టిపడేసేలా ఉంది. మొత్తానికి ‘మాస్ స్ట్రైక్’ చూస్తుంటే కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు, మాస్ అభిమానులు అందరూ కన్నుల పండుగలా ఉంది.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.