Sunday, December 22, 2024

మహేశ్‌గౌడ్‌వైపే మొగ్గు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ పదవిపై కొద్దిరోజులుగా నె లకొన్న ఉత్కంఠకు నేడు లేదా రేపు తెరపడనుంది. తెలంగాణ పిసిసి చీఫ్ ఎవరన్నది తేలిపోనుంది. ఇప్పటికే పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు గా తెలిసింది. తెలంగాణతో పాటు రెండు రాష్ట్రాలకు కొత్త పిసిసి చీఫ్‌ల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేయడంతో పాటు వారి పేర్ల ను ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్ పిసిసి చీఫ్‌గా దీపాదాస్ మున్షీ, కేరళ పిసిసి అధ్యక్షుడిగా కెసి వేణుగోపాల్ పేరు ఖరారైంది. ప్రస్తుతం కెసి వేణుగోపాల్ స్థానంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ ము న్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ రానున్నారు. ఈ నే పథ్యంలోనే మార్పులు, చేర్పులను నేడో, రేపో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

తెలంగాణ పిసిసి చీఫ్‌గా మహేష్ గౌడ్…!
కాగా, తెలంగాణ పిసిసి చీఫ్‌గా మహేష్ గౌడ్ పేరును హైకమాండ్ ఖారారు చేసినట్లుగా తెలుస్తోంది. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ, ఆయన ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పిసిసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ, ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

సామాజిక సమీకరణాలతోనే…
ఈ ఏడాది జనవరి 29వ తేదీన తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో మహేష్ గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు టిపిసిసి చీఫ్‌గా ఆయన ఆ పదవిని అలంకరించబోతున్నారు. సిఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బిసి నేతలకే పిసిసి ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే సామాజిక సమీకరణాలన్నీ మహేశ్‌గౌడ్‌కు కలిసొచ్చాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News