ఇకనైనా కౌశిక్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలి
కెసిఆర్, కెటిఆర్ మెప్పు కోసం కౌశిక్‌రెడ్డి ఇలా వ్యవహారిస్తున్నారు
టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదని కేవలం కెసిఆర్, కెటిఆర్ మెప్పు కోసం ఆయన ఇలా వ్యవహారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని ఆయన హితవు పలికారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కెసిఆర్, కెటిఆర్ అదుపుచేయాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు క్రమశిక్షణ అవసరమని, ఇకనైనా కౌశిక్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు. ఈ రకమైన ప్రవర్తనతో రాజకీయంగా ఎదుగుతామనుకోవడం అవివేకమేనని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రవర్తన ఎవరూ చేసిన ఉపేక్షించ వద్దన్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకోవాలని పిసిసి అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. పల్లెల్లో ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి వేడుకలు ఇలా హైదరాబాద్‌లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన తెలుగు పండుగలను రాబోయే తరాలకు అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.