మన కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఏఐసిసి ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ఏఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం మహేశ్‌కుమార్ గౌ డ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ పిసిసి పదవిని బిసిలకు ఇ వ్వాలని నిర్ణయించిన అధిష్టానం, ఇందుకోసం మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ పేర్లను పరిశీలించింది. వీరిరువురికి సంబంధించి పార్టీ కీలక నేతల నుంచి అభిప్రాయం తీసుకొని చివరకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఖరారు చేసింది. రెండు వారాల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి కాగా, శుక్రవారం అధికారిక ఉత్తర్వులను అధిష్టానం జారీ చేసింది. అ యితే వివిధ సామాజిక కోణాల్లో అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసిసి అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహు ల్ గాంధీలు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో ఇ టీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బిసి సామాజిక వర్గానికి చెందిన నేతకు పి సిసి పదవిని కట్టబెట్టాలన్న తుది నిర్ణయానికి వచ్చి న ఎఐసిసి మహేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.
మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ, ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పిసిసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ, ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.
సామాజిక సమీకరణాలతోనే…
ఈ ఏడాది జనవరి 29వ తేదీన తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో మహేష్ గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు టిపిసిసి చీఫ్‌గా ఆయన ఆ పదవిని అలంకరిస్తున్నారు. సిఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బిసి నేతలకే పిసిసి పీఠం అప్పాచెప్పాలని ఏఐసిసి నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే సామాజిక సమీకరణాలన్నీ మహేశ్‌గౌడ్‌కు కలిసొచ్చాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కరాటే మాస్టర్ నుంచి కాంగ్రెస్ అధినేత దాక….
కరాటే మాస్టర్ నుంచి కాంగ్రెస్ అధినేత దాక బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎదిగారు. ఒకే ఏడాది ఆయనకు రెండు పదవులు వరించాయి. అందులో ఒకటి ఎమ్మెల్సీ కాగా, మరొటి పిసిసి అధ్యక్షుడి హోదా. ఎన్నో ఒడిదుడుకులతో మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం సాగింది. ఆయన బ్రతుకుదెరువు కోసం కరాటే మాస్టర్‌గా జీవనం సాగిస్తూ దివంగత నేత డిఎస్ పిలుపు మేరకు ఎన్‌ఎస్‌యూఐ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రాజకీయాల్లో ఆయన అనేక ఒడిదొడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి తన రాజకీయ ప్రస్థానాన్ని సాగించారు. ఈ సక్సెస్ కోసం ఆయన మూడున్నర దశాబ్దాలుగా శ్రమిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఒకే ఏడాది రెండు పదవుల దక్కాయి.
మల్లికార్జున ఖర్గేను కలిసిన మహేశ్‌కుమార్ గౌడ్
రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ ఎంపికపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు అభినందనలు తెలిపారు. తనను పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాద పూర్వకంగా మహేశ్‌కుమార్ గౌడ్ ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అధిష్టానానికి ధన్యవాదాలు: మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింనందుకు మహేశ్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తనపై అత్యంత నమ్మకంతో తనకు కీలకమైన టిపిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపిలకు, ఎమ్మెల్సీలకు,
ఎమ్మెల్యేలకు, డిసిసి అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేశారు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇంతకాలం తనకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.