ప్రజల మద్దతుతో సంక్షేమ పథకాలు
గాంధీభవన్ జాతీయపతాకావిష్కరణలో
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ తొలి పదేండ్ల కాలంలో పాలకులు అర్హులైన పేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇళ్లు కట్టించలేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంతపాలన చేసిన బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనతీరును జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు.
బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనువాద సిద్దాంతాన్ని అమలుచేసేందుకు కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేసే ప్రయత్నంలో దేశ ప్రజలందరూ చూస్తుండగా పార్లమెంటులోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేసి అవమానించారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఈ రోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ భరోసా కింద రూ.12 వేలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని పిసీసీ అధ్యక్షుడు గుర్తుచేశారు. రాజ్యాంగ బద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామని, హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఎల్లప్పుడూ పక్షాన ఉంటుందని తెలిపారు.
అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని, దీనికి ప్రజలంతా మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, చైర్మన్ లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.