Wednesday, January 22, 2025

చేరికలు ఆగలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఆగలేదని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉం టాయని అన్నారు. పార్టీలో ఉన్నవారిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బిఆర్‌ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారని అ న్నారు. వాస్తవానికి కెటిఆర్‌తో సన్నిహితంగా ఉండే వారు, ఆయన వెనక తిరిగేవారే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మహేశ్ కుమార్ అన్నారు. కెసిఆరే కనిపించడం లేదు&అలాంటప్పుడు ఎవరిని చూసి బిఆర్‌ఎస్‌లో కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇప్పటికే తమ పార్టీలో చేరిన వారిని సాంకేతిక కారణాల వల్ల అధికారికంగా ప్రకటించడం లేదన్నారు. ఫిరాయింపులపై కోర్టుదే తుది నిర్ణయం అన్నారు.

పార్టీలోకి కొ త్తగా వచ్చిన వారికి, పాత వారికి మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఇరువైపుల నచ్చజెప్పడానికి పిసిసి ప్రయత్నం చేస్తుందని వివరించారు. పార్టీమెన్‌గా తనను అందరూ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేను చేర్చుకునే అంశాన్ని జీవన్‌రెడ్డికి చెప్పాకే చేర్చుకున్నామని మహేశ్‌కుమార్‌గౌడ్ వివరించారు. జీవన్‌రెడ్డికి పార్టీ, తాము అండగా ఉంటామని అన్నారు. జీవన్‌రెడ్డి అనుచరుడి హత్యపై విచారణ చేయాలని సీఎం కార్యాలయం నుంచే ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి పరిధిలో ఉందన్నారు. విస్తరణ ఎప్పుడు చేయాలన్నది వారి నిర్ణయమేనని అన్నారు.

పొంగులేటి చెప్పిన బాంబులపై నేనూ ఎదురుచూస్తున్నా&
దీపావళికి ముందు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘పొంగులేటి పొలిటికల్ బాంబులపై నేనూ ఎదురుచూస్తున్నాను’ అని మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణలు తదితర అన్ని కేసులపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద వ్యవహారమని, దీనిపై కేంద్ర చట్టాలు కఠినంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఏ కేసును కూడా తాము నీరుగార్చే ప్రయత్నం చేయడం లేదని అన్నారు.

కొండా సురేఖ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు
అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘అలా మాట్లాడి ఉండాల్సింది కాదు’ అని అభిప్రాయపడ్డారు. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా ఆమెను ట్రోల్ చేసిన బాధలో, ఆక్రోశంతో అలా మాట్లాడి ఉండవచ్చు, కానీ అలా మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు.

ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.. విద్యుత్ చార్జీలు పెంచం
ఆరు గ్యారంటీలను తూ.చ తప్పకుండా అమలు చేసి తీరుతామనని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు తమకు లేకపోవడం వల్ల అన్ని గ్యారంటీల అమలుకు కొంత ఆలస్యం జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉండగా, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.8 కోట్ల అప్పు చేయడం వల్లనే కొంత ఇబ్బంది ఎదురైనా ఏ పథకాన్ని తాము అపలేదని అన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల పడుతున్న ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వారు పదేండ్లలో విడతల వారీగా చేసిన రుణమాఫీ కంటే తాము చేసిందే ఎక్కువేనని అన్నారు. కెసిఆర్ మాదిరిగా తాము ప్రజలను మోసం చేయమని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు.

విద్యుత్ చార్జీలను పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతల్లో ఏ ఒక్క పేద ఇల్లు కూల్చకపోయినా బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా ప్రభుత్వాన్ని బదునామ్ చేస్తుందని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ పట్టుకునే అవకాశం లేకుండా సోషల్ మీడియాను విదేశాల నుంచి నడిపిస్తుందని ఆరోపించారు. వయనాడ్‌లో జరిగినట్టు విధ్వంసం జరగకూడదనే మూసీ ప్రక్షాళన చేపట్టామని, విడతల వారిగా చేస్తామని, పేద ప్రజలకు అన్యాయం జరుగనీయమని స్పష్టం చేశారు. అన్ని అనుమతులు ఉన్న ఇండ్లను కూల్చమని స్పష్టం చేశారు. సిఎం సోదరుడు తిరుపతిరెడ్డి తన ఇళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చమని చెప్పినప్పటికీ, కోర్టు మార్గదర్శకాల వల్ల కూల్చలేదని మహేశ్‌కుమార్‌గౌడ్ వివరించారు. జీవో 29 వల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. మరి ఆందోళన ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియడం లేదని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ఖర్గే, రాహుల్‌లను కలిసిన పిసిసి అధ్యక్షుడు
ఏఐసిసి అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మల్లికార్జున ఖర్గేకు పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన పిసిసి అధ్యక్షుడు శనివారం ఖర్గేతో పాటు ఏఐసిసి అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోనూ సమావేశమయ్యారు. శనివారం రాహుల్ గాంధీతో 10 నిమిషాల పాటు సమావేశం అయిన టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు పార్టీ పరంగా తాను ఎన్నికై 50 రోజుల పాటు జరిగిన పలు ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాల వివరాల గురించి పిసిసి అధ్యక్షుడు రాహుల్‌కు తెలియచేశారు. ఏఐసిసి అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి తదితరులు ఓ ప్రకటలో శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News