భవిష్యత్ రాజకీయాలన్నీ బిసిల చుట్టే
తిరుగుతాయి బిసి రిజర్వేషన్లను 9వ
షెడ్యూల్‌లో చేర్చే దమ్ము కేంద్రమంత్రి
బండి సంజయ్‌కి ఉందా?
దేశవ్యాప్తంగా కులగణన జరపాలని
మోడీని అడిగే సత్తా బిజెపి నేతలకు
ఉందా? బిసిలు ఏకతాటిపైకి
రావాలి : పిసిసి సారథి మహేశ్‌గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న రోజుల్లో తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతానికి రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి గా కొనసాగుతారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. బిసిలకు రా జ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ ధృడ సంకల్పంతో ఉన్నారని అందులో భాగంగా ఏదో ఒకరో జు బిసిల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వస్తార ని, ఒక బిసి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం కేవ లం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్ని ఎన్నికలు బిసిల చుట్టూ తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. రానున్న కేబినెట్ విస్తరణలో బిసిలకు అ ధిక ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించా రు. గాంధీభవన్‌లో ఏఐసిసి ఓబిసి విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్ తో కలిసి సోమవారం పిసిసి అధ్యక్షుడు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నందునే కులగణన చేపట్టామని బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా చూడాలని ఆయన సూచించారు. తాము తీసుకువస్తున్న బిసి రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోడీని ఒప్పించి 9వ షెడ్యూల్ లో పెట్టేలా చూడాలని ఈ సందర్భంగా బండి సంజయ్‌కు పిసిసి అధ్యక్షుడు సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా మోడీతో మాట్లాడాలంటూ బిజెపి నేతలకు ఆయన సూచించారు. 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్దత కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును శాసనసభలో ప్రవేశపెడతామన్నారు. ఆ బిల్లును శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా పార్టీలకు అతీతంగా నాయకులను తీసుకొని మోడీని కలుస్తామని ఆయన తెలిపారు. ఆ బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చడం కోసం ప్రధాని మోడీని ఒప్పించే దమ్ముందా బండి సంజయ్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు.
కుల గణనతోనే బిసిలకు కొత్త అధ్యాయం మొదలు
దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని మోడీని అడిగే సత్తా ఉందా వారికి ఉందా అని ఆయన అన్నారు. కుల గణనతోనే బిసిలకు కొత్త అధ్యాయం మొదలయ్యిందన్నారు. బిసిల్లో ఐక్యత లోపించిందని, బిసిలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా భవిష్యత్ బిసిలదేనని ఆయన పేర్కొన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు బిసి నాయకుడిని సిఎం చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు కులగణన సర్వే నిర్వహించామన్నారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ తన ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిందని ఆయన తెలిపారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను తొలగిస్తే పార్టీలకు అతీతంగా స్పందించామన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కెసిఆర్ కుటుంబానిదని ఆయన పేర్కొన్నారు. బిసిల గురించి మాటలే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
న్యాయ వ్యవస్థల మీద ఆర్‌ఎస్‌ఎస్ దాడి: అజయ్ సింగ్ యాదవ్
జాతీయ ఓబిసి డిపార్ట్‌మెంట్ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కులగణన చేపట్టినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కులగణన దేశానికి దిశా నిర్దేశం అవుతుందన్నారు. ఇది గేమ్ చేంజర్‌గా మారుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని నమ్మదని, అందుకే జాతీయ జెండాను అవమానించారని ఆయన ఆరోపించారు. వారు న్యాయ వ్యవస్థల మీద దాడి చేస్తున్నారన్నారు. ఈడిని జార్ఖండ్ సిఎం మీద ప్రయోగించి జైలుకు పంపారన్నారు. తప్పుడు కేసులతో ఈడీ, సిబిఐలను కేంద్రం ప్రతిపక్షం మీద ప్రయోగిస్తుందన్నారు. బ్యాన్ ఈవిఎం అనే నూతన నినాదం కాంగ్రెస్ తీసుకువస్తుందన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
40 శాతం సంపద ఉన్నత వర్గాల వద్దే….
తెలంగాణ ప్రభుత్వం కుల సర్వేలో భాగంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య వివరాలు సేకరించిందన్నారు. ఏ రంగాల్లోని ఉన్నత స్థానాల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90శాతం మంది హైకోర్టు న్యాయవాదులు కూడా ఉన్నత కులాల వారే ఉన్నారన్నారు. క్రిమిలేయర్ నిబంధన రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పెంచాలన్నారు. 40 శాతం సంపద ఉన్నత వర్గాల దగ్గరే ఉందన్నారు. 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ నిబంధన ను ఈడబ్లూఎస్‌లో 10శాతంతో అతిక్రమించారని ఆయన ఆరోపించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే కాంగ్రెస్‌పై ముస్లిం పార్టీ అని ముద్ర వేస్తున్నారన్నారు.