హైదరాబాద్: తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసి తేల్చుకుంటానని కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పారు. పిసిసి నుండి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై స్పందించారు. బుధవారం ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లడారు. తనకు షోకాజ్ ఎందుకు ఇచ్చారో గురువారం లోపుగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పిఎసిలో తాను ఉండడం ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీ మారుతానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. క్రెడిబులిటీ లేని వాళ్లు తనకు నోటీసులు ఇచ్చారని పిసిసి నాయకత్వంపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
బ్లాక్ మెయిల్ చేసి పార్టీ మారిన వ్యక్తిత్వం తనది కాదని పరోక్షంగా రేవంత్‌పై ఆయన విమర్శించారు. తన విషయలో పిసిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదన్నారు. తనకు కారణం లేకుండా నోటీస్ ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా కూడా ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. ఎథిక్స్ తో రాజకీయాలు చేసినట్టుగా చెప్పారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు రూల్స్ తెలియవన్నారు. ఎఐసిసి కార్యక్రమాల కమిటీ అమలు చైర్మెన్‌గా ఉన్న తనకు పిసిసి ఎలా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.