నిర్మల్: నిర్మల్ పట్టణంలో చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంతో 5వ రోజుకు చేరుకుంది. శనివారం బిజెపి కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం పట్ల తీవ్ర స్థాయిలో బిజెపి నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే మహేశ్వర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆదివారం పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఆయన ఇంటి లోపలికి రాకుండా పోలీసులను బిజెపి నాయకులు అడ్డుకున్నారు. అదే తరుణంలో బిజెపి నాయకులు పెద్దఎత్తున గాజులపేట్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడ నుంచి మంత్రి నివాసానికి ర్యాలీగా వెళ్లారు.
అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బిజెపి నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకోవడంతో మళ్లీ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ బిజెపి నాయకులు నినాదాలు చేశారు. మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలుపడానికి వస్తున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, నిజామాబాద్ ఎంపి అరవింద్‌లను ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిర్మల్‌లో చేపడుతున్న మాస్టార్ ప్లాన్ రద్దు చేయాలని చేపడుతున్న నిరాహార దీక్షకు ఎందుకు స్పందన లేదని వారు ప్రశ్నించారు. దీంతో వారు కూడా పోలీసులతో స్పల్ప వాగ్వాదానికి దిగారు.
రోజురోజకు క్షీణిస్తున్న మహేశ్వర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి
మాస్టార్ ప్ల్లాన్ రద్దు చేయాలని కోరుతూ ఆరమణ నిరాహార దీక్ష చేస్తున్న మహేశ్వర్‌రెడ్డి ఆరోగ్యం రోజురోజకు క్షీణించడంతో ఇటు బిజెపి నాయకుల్లో, ప్రజల్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బిజెపి శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.