ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకే వచ్చిందని పేర్కొంటూ మేయర్ పారిజాత ప్రచారం మొదలుపెట్టారు. పారిజాతకు మద్దతు తెలపాలని కోరుతు మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఆ నియోజకవర్గ ప్రజలకు ఫోన్లకు మేసెజ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏఐసిసి, పిసిసి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే సొంతంగా తానే అభ్యర్థినని ప్రచార రథం వేసుకొని పారిజాత తిరుగుతున్నారు. పారిజాత తీరుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులే ప్రకటించకపోయినా ఈ ప్రచార సభలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ నాయకులు సీరియస్ అవుతున్నారు.
పారిజాత ప్రచారం సోషల్ మీడియాలో వైరల్
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పారిజాత నర్సింహారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆమెకు బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ పదవి దక్కింది. అయితే మంత్రి సబితతో మేయర్‌కు కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్లుగా సమాచారం. సబిత తీరుతో మనస్తాపం చెందిన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందే పారిజాత ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.