Wednesday, January 8, 2025

రూ.9 కోట్లతో రాష్ట్ర స్థాయి మహిళాశక్తి బజార్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు స్రీనిధి పథకం కింద వారికి రుణాలు మంజూరు చేసి ఔత్సాహిక మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. తాజాగా హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మహిళాశక్తి బజార్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 5న పంచాయితీ రాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క ఈ బజార్‌ను ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం మాదాపూర్‌లోని శిల్పారామంలో ఉన్న స్టాల్స్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.9 కోట్లు కేటాయించి స్టాళ్ల పునరుద్ధరణ పనులు చేపట్టింది. మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు రైతు బజార్ తరహాలో వీటిని సిద్ధం చేశారు.

‘ఇందిరా మహిళా శక్తి బజార్’ గా నామకరణం చేశారు. అయితే దీనికి మరో పేరు ‘నైట్ బజార్’ అని కూడా పిలవనున్నారు. వీటిని ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు ప్రభుత్వ తోడ్పాడుతో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వారు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం ఈ బజార్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని జిల్లాస్థాయిల్లో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో విక్రయిస్తున్నారు. అయితే అలా కాకుండా ఆయా సంఘాల ఉత్పత్తుల కోసం హైదరాబాద్‌లో శాశ్వత విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా శిల్పారామంలో మహిళాశక్తి బజార్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శిల్పారామంలో రూ.9 కోట్ల వ్యయంతో 106 ప్రత్యేక స్టాళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ స్టాళ్లలో మహిళా సంఘాలు తయారుచేసే ప్రత్యేక ఉత్పత్తులతో పాటు హ్యాండిక్రాఫ్ట్, చేనేత వస్త్రాల విక్రయశాలలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు అమ్ముకోవటమే కాకుండా పండగలు, మేళాలు, ప్రత్యేక సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను సైతం మహిళా శక్తి బజార్‌లో నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా వేదికను సైతం సిద్ధం చేస్తున్నారు.

స్టాళ్లను సందర్శించే వారికోసం ఫుడ్‌కోర్టులను సైతం ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో విభిన్న ఉత్పత్తుల తయారీకి పేరొందిన మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి)లకు స్టాళ్లను కేటాయించనున్నారు. వీటిని ఎంపిక చేసేందుకు వీలుగా సెర్ప్ అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయటమే కాకుండా సమాచారం కూడా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం మహిళా సంఘాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఐటీ హబ్‌కు సమీపంలోనే ఈ ప్రదర్శన ప్రదేశం ఉండటంతో అమ్మకాలు సైతం వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చేనేత, హస్తకళలు, కళంకారి వస్తువులు, గృహానికి సంబంధించిన వస్తువులు, అలంకరణ పరికరాలు, జ్యూవెలరీ, క్లాత్స్, ఇతర వస్తువులతో పాటు పసైందన ఆహార స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకే ఇవి కేటాయించారు. గ్రామీణ ఉత్పత్తి దారులను పట్టణ, అంతర్జాతీయ వినియోగదారులతో అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని, అతివలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు వారి స్వయం ఉపాధికి బాటలు వేసేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. విభిన్నమైన వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు సరసమైన ధరలకు లభించేలా ఉంచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News