ప్రజలకు లంక ప్రధాని మహీందా సందేశం
కొలంబో : తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభంతో దేశ ప్రజలకు తలెత్తిన అష్టకష్టాల పట్ల చింతిస్తున్నామని, ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు రాత్రింబవళ్లు పటుపడుతామని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సా తెలిపారు. దేశాధ్యక్షులు గొటాబాయ రాజపక్సా పెద్ద అన్నయ్య అయిన మహీందా సోమవారం జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. తమను ప్రజలు క్షమించాలని, క్లిష్టత నుంచి ప్రజలను గట్టెక్కించే బాధ్యతను తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉంది. అసాధారణ స్థాయిలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతుంది.
అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు బాధచెందే వీధుల్లోకి వచ్చారు. దీనిని తాము అర్థం చేసుకోగలమని అయితే వారు నిరసనలలో గడిపే ప్రతిక్షణంతో ఇప్పటికే దివాళా తీసిన దేశానికి మరింత డాలర్ల కొరత ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శక్తివంచన లేకుండా యత్నిస్తామని, దీనిని జనం నమ్మాలని కోరారు. రాజపక్సా కుటుంబం పదవుల నుంచి వైదొలగాలని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రదర్శనలకు దిగారు. వీరిని శాంతింపచేసేందుకు సీనియర్ రాజపక్సా ప్రయత్నించారు. ప్రజలు ఉద్యమ బాట వీడాలని పిలుపు నిచ్చారు.
లాక్‌డౌన్లతో ఇప్పటి దుస్థితి
దేశంలో ప్రస్తుత ఆర్థిక దుస్థితికి రెండేళ్ల కరోనా తరువాతి లాక్‌డౌన్లు, బలహీనపు ఆర్థిక వ్యవస్థ కారణం అని ప్రధాని మహీందా ప్రజలకు తెలిపారు. దేశానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టే పర్యాటక రంగం లాక్‌డౌన్లతో దెబ్బతింది. దీనితో ఆర్థిక వ్యవస్థకు గండిపడిందన్నారు. వైరస్ కారణంగా తప్పనిసరిగా లాక్‌డౌన్లకు దిగాల్సి వచ్చిందన్నారు. ఆహార ఇంధన కొరత, బ్లాకౌట్లు దేశ ఆర్థిక స్థితిని మరింతగా దిగజార్చాయని, వనరుల కొరత ఉన్న దేశానికి ఇటువంటి చిక్కులు వచ్చిపడుతాయని, వీటిని విజయవంతంగా అధిగమిస్తామని అయితే ముందు జనం తమను నమ్మి సహనం వహించాలని లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.