సిఎం అధికంగా నిధులు కేటాయిస్తున్నారు
ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్స్
హోంమంత్రి మహమూద్ అలీ
మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీస్ డిపార్ట్‌మెంట్ బలోపేతానికి తెలంగాణ సిఎం కృషి చేస్తున్నారని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. సికింద్రాబాద్‌లోని మహంకాళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మంగళవారం ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ సోలేటి దామోదర్ గుప్తా, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు పోలీస్ కమిషనరులు డిఎస్‌చౌహాన్, శిఖాగోయల్, జాయింట్ సిపి అవినాష్ మహంతి, డిసిపిలు కల్మేశ్వర్, ఎల్‌ఎస్ చౌహాన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ బలోపేతానికి సిఎం పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్స్ ఇస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, దీంతో నగరంలో వాహనాల వేగం పెరిగిందని అన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆధునికంగా నిర్మించామని తెలిపారు. ట్రాఫిక్ ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టం మంచిగా పనిచేస్తోందని అన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన షీటీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.