న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమెపై బిజెపి ఎంపి నిషికాంత్ దూబే తాజాగా మరిన్నిఆరోపణలు చేశారు. ఆమె భారత్‌లో ఉండగా ఎంపి లోక్‌సభ ఐడిని దుబాయినుంచి మరొకరు ఉపయోగించారని పరోక్షంగా ఆరోపించారు. ఈ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్( ఎన్‌ఐసి)దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్లు ఆయన శనివారం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ‘ ఓ ఎంపి(మహువా మొయిత్రానుద్దేశించి) డబ్బుల కోసం దేశ భద్రతను తాకట్లు పెట్టారు.
ఆ ఎంపి భారత్‌లో ఉండగానే ఆ వ్యక్తి పార్లమెంటు ఐడిని దుబాయినుంచి ఓపెన్ చేశారు. ఈ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ దర్యాప్తు సంస్థలకు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆర్థిక శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్‌ఐసిని ఉపయోగిస్తోంది. ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దీనిపై రాజకీయం చేయాలనుకుంటున్నాయా? ఇక దీనిపై నిర్ణయం ప్రజలదే’ అని నిషికాంత్ దూబే మహువా పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపణలు చేశారు. అయితే ఏ ఏజన్సీకి సమాచారం అందిందనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.