Friday, November 22, 2024

నా నోరు నొక్కినందుకు బిజెపికి భారీ మూల్యం: మహువా మొయిత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత లోక్‌సభలో తనను బహిష్కరించినందుకు అధికార బిజెపిపై టిఎంసి ఎంపి మహువా మొయిత్ర నిప్పులు చెరిగారు. తన గొంతు నొక్కినందుకు 63 మంది ఎంపీలను కోల్పోయి బిజెపి భారీ మూల్యాన్ని చెల్లించుకుందని ఆమె విమర్శించారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెఇపే తీర్మానంపై మహువా ప్రసంగిస్తూ గత పార్లమెంట్ సమావేశాలలో ప్రతిపక్షాల పట్ల వ్యవహరించిన రీతిలో ఇప్పుడు బిజెపి వ్యవహరించచం సాధ్యం కాదని అన్నారు.

గత సమావేశాలలో తాను లేచి నిలబడినప్పటికీ తనకు మాట్లాడేందుకు అనుమతించలేదని, ఒక ఎంపీ గొంతు నొక్కింనందుకు అధికార బిజెపి భారీ మూల్యాన్ని చెల్లించుకుందని ఆమె చెప్పారు. ప్రశ్నకు నగదు కేసును పురస్కరించుకుని 2023 డిసెంబర్‌లో 17వ లోక్‌సభ నుంచి మహువాను స్పీకర్ బహిష్కరించారు. తన నోరు మూయించడానికి ప్రయత్నించినందుకు వారి నోరును ప్రజలే మూయించారని, ఇందుకు 63 మంది ఎంపీలను కోల్పోవలసి వచ్చిందని ఆమె బిజెపిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌లో సెంగోల్‌ను ప్రతిష్టించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. అది రాచరికానికి చిహ్నమని, ప్రజాస్వామ్యంలో దానికి స్థానం లేదని ఆమె చెప్పారు. బిజెపి రాజ తంత్రాన్ని ఈ దేశ లోక్ తంత్ర(ప్రజాస్వామ్యం) అణచివేసిందని, ఇప్పుడు ఉన్నది సుస్థిర ప్రభుత్వం కాదని ఆమె అన్నారు. యు టర్న్‌లలో ఆరితేరిపోయిన చరిత్రగల అనేక మంది మిత్రుల మీద ఆధారపడి ఈ ప్రభుత్వం నడుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. తాము ఈసారి 234 మంది యోధులము ఉన్నామని, నిప్పుల మీద నడుచుకుంటూ ఇక్కడకు వచ్చామని, గతంలో మాదిరిగా ఇప్పుడు తమ పట్ల వ్యవహరించడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News