న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ జరిపిన విచారణలో తాను అవమానకరమైన ప్రశ్నలను ఎదుర్కొన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా చెప్పారు. దీనికి నిరసనగా వాకౌట్ చేసిన ప్రతిపక్ష ఎంపిలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కేసుతో సంబంధంలేని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారని పిటిఐకి ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆమె చెప్పారు. దీనిపై తాను అభ్యంతరం తెలియజేశానని ఆమె అంటూ సంబంధం ఉన్న ఏ ప్రశ్నకైనా అఫిడవిట్ ద్వారా సమాధానమిస్తానని కూడా చెప్పారు.
కమిటీ మీటింగ్‌లో జరిగిన దానిపై ఎవరు కూడా మాట్లాడకూడదని రూల్స్ చెబుతున్నప్పటికీ, తాను ‘మాటల వస్త్రాపహరణ’కు గురైనందున మాట్లాడుతున్నానని కూడా ఆమె చెప్పారు. చైర్మన్ ప్రవర్తనకు నిరసనగా కమిటీలోని 11 మంది సభ్యుల్లో అయిదుగురు సభ్యులు వాకౌట్ చేశారు. ‘అది పేరుకు ఎథిక్స్ కమిటీ అయినా అత్యంత అనైతికమైన రీతిలో విచారణ జరిగింది. చైర్మన్ ముందుగా రాసుకున్న స్క్రిప్ట్‌తో వచ్చారు. అందులోంచి చదివి అడిగారు. దానిలో విచారణతో ఏమాత్రం సంబంధం లేని అత్యంత అసహ్యకరమైన, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి’ అని మొయిత్రా అన్నారు.