న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను కాళీ చేయక తప్పలేదు. ఎంపిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు జారీ చేసిన నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ విభాగం అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే నివాసాన్ని ఖాళీ చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది షాదన్ ఫరాసత్ చెప్పారు. గత డిసెంబర్ 8న మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 7వ తేదీ లోగా ఆమెకు కేటాయించినఅధికారిక భవనాన్ని చేయాలంటే గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ చర్యలు చేపట్టింది.
శుక్రవారం ఉదయం అధికారుల బృందం మహువాకు కేటాయించిన టెలిగ్రాఫ్ లేన్ లోని 9బి నివాసానికి చేరుకున్నారు. అయితే అప్పటికే మొయిత్రా బంగ్లాను ఖాళీ చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది ఫరాసత్ తెలిపారు. ఎలాంటి బలవంతపు చర్యలు చోటు చేసుకోలేదని, బంగ్లా తాళాలను డిఇఓ అధికారులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందానినుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదయిన కానుకలు తీసుకున్నారని, పార్లమెంటు లాగిన్‌ను దుబాయినుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరిపిన ఎథిక్స్ కమిటీ మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కారానికి పాల్పడినట్లు పేర్కొంది. దీంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను సభనుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.