చండీగఢ్ : పంజాబ్ లోని పాటియాలాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడ్ని మొహాలీలో అరెస్టు చేసినట్టు పాటియాలా ఐజీ ముఖ్విందర్ సింగ్ చనియా మీడియాకు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టి పోలీస్ రిమాండ్ కోరుతామని తెలిపారు. జిల్లా లోని రాజపురాకు చెందిన బర్జిందర్ సింగ్ పర్వానా పాటియాలా లో శుక్రవారం జరిగిన ఘర్షణలకు కీలక సూత్రధారి అని తెలిపారు. హరీష్‌సింగ్లా సహచరుడు శంకర్ భరద్వాజ్‌తోపాటు జగ్గీ పండిట్‌ను కూడా అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ అల్లర్లకు సంబంధించి శనివారం శివసేన నేత హరీష్ సింగ్లా, కుల్దీప్ సింగ్ దంతాల్, దల్జీత్ సింగ్ లను అరెస్టు చేశారు. శనివారం సాయంత్రానికి 25 మంది నిందితులను గుర్తించారు. పాటియాలాలో ఘర్షణల నేపథ్యంలో శనివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా కర్ఫూ విధించడంతోపాటు సాయంత్రం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శివసేన పంజాబ్ విభాగం పాటియాలాలో శుక్రవారం యాంటీ ఖలిస్థాన్ మార్చ్ నిర్వహించగా, దీనికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు , నిహాంగ్స్ మరో ర్యాలీ చేపట్టారు. నగరం లోని కాళీమాత ఆలయం వద్ద రెండు గ్రూపులు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తతలు తలెత్తి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూసుకున్నారు. నలుగురు గాయపడ్డారు.