Wednesday, January 22, 2025

యువతిని రోడ్డుపై పడేసి కర్రలతో దాడి… వీడియోపై దుమారం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఓ వీడియో దుమారం రేపుతోంది. ఓ యువతితోపాటు మరో వ్యక్తిని రోడ్డుపై పడదోసి కర్రలతో చితకబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అక్కడ గుమికూడిన వారంతా నిలబడి ఆ సంఘటనను చూస్తున్నారే తప్ప ఆపడానికి ప్రయత్నించలేదు సరికదా కర్రలతో కొడుతున్న వ్యక్తికి సాయం చేస్తుండడం, బాధితురాలు బాధతో కేకలు పెడుతుండడం వీడియోలో కనిపించింది. ఒకానొక దశలో చితకబాదుతున్న వ్యక్తి బాధితురాలి జుట్టు పట్టుకుని ఈడ్చడం, కాలితో తన్నుతుండడం దశ్యాలు వైరల్ అయ్యాయి.

ఈ సంఘటనకు కారణమేమిటో తెలియడం లేదు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రత ల దుస్థితిని ఈ సంఘటన తెలియజేస్తుందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఈ సంఘటనపై ఎక్స్ (ట్విటర్) లో వ్యాఖ్యానిస్తూ ‘ ఈ వీడియోలో యువతిని దారుణంగా కొడుతున్నది ఉత్తర బెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్‌జిల్లా చోప్రా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తృణమూల్ ఎమ్‌ఎల్‌ఎ హమిదుర్ రెహ్మాన్ అనుచరుడు తేజ్‌ముల్ అనే వ్యక్తి . ఇతను తన ‘ఇన్‌సాఫ్’ సభల ద్వారా పంచాయతీలు చేసి అక్కడికక్కడే శిక్షలు విధిస్తుంటాడు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని భారత ప్రజలు మొత్తం గుర్తించాలి.

బెంగాల్‌లో ప్రతిగ్రామంలో ‘సందేశ్‌ఖాలీ ’ తరహా సంఘటనలు జరుగుతున్నాయి. మమత పాలన పశ్చిమబెంగాల్‌కు ఒక శాపం. ’ అని మాలవ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క సిపిఎం నేతలు కూడా యువతిని కొడుతున్న వీడియోపై స్పందించారు. బెంగాల్‌లో బుల్‌డోజర్ న్యాయం రాజ్యమేలుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీమ్ ఎక్స్ (ట్విటర్)లో విమర్శించారు. కాగా ఈ సంఘటన ఈ వారాంతం లోనే జరిగినట్టు తెలుస్తోంది. పోలీస్‌లు దీనిపై కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నామని చెప్పారు. తృణమూల్ ప్రభుత్వం ఈ వీడియోపై స్పందించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News