న్యూఢిల్లీ : భారత సైన్యం విధి నిర్వహణ, కార్యకలాపాల్లో సమర్ధతను పెంచేందుకు ప్రస్తుత సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తనలపై ప్రధానంగా దృష్టి పెడతానని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం చెప్పారు. సైన్యానికి దేశ నిర్మాణంలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు ఉన్నాయని, దేశ రక్షణ కోసం కృషిని కొనసాగిస్తామని చెప్పారు. సమకాలీన, భవిష్యత్తు, భద్రతా సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ సంసిద్ధతలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను నిర్ధారించడం తన ప్రాధాన్య అంశమని ఆర్మీ నూతన చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ప్రపంచ, భౌగోళిక , రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఫలితంగా మనముందు అనేక సవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో వైమానిక, నావికా దళాల సమన్వయం సహకారంతో ఎటువంటి పరిస్థితులనైనా ఐక్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆదివారం సౌత్ బ్లాక్ లాన్స్‌లో సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రక్షణ రంగంలో స్వావలంబనతోపాటు మెరుగైన సామర్ధాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తన పైనా దృష్టి సారిస్తానని తెలిపారు. సైన్యం ఆధునికీకరణ ప్రక్రియలో కొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇదివరకటి అధికారుల మంచి పనులను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. భారత వాయుసేన, భారత నావికా దళాల చీఫ్‌లతో తనకు పరిచయం ఉందన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం, సహకారం, ఉమ్మడి తత్వాలకు ఇది నాంది అని చెప్పారు. త్రివిధ దళాలతో కలిసికట్టుగా పనిచేస్తామని, దేశ భద్రత, రక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు. సైనికులు, సైన్యాధికారుల సంక్షేమానికి భరోసా ఇస్తున్నానన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే స్థానంలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు.