Saturday, January 11, 2025

అమలుకాని ఐరాస తీర్మానాలు!?

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత గల ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రత మండలి 1967-1989 మధ్య ఇజ్రాయెల్-, పాలస్తీనా ఘర్షణకు సంబంధించి 131 తీర్మానాలు చేసింది. (14 మే 1948లో పాలస్తీనా విభజన నుండి ఇజ్రాయెల్, పాలస్తీనా, అరబ్‌ల మధ్య రాజకీయ వత్తిళ్ళు, సైనిక సంఘర్షణలు, మత వివాదాలున్నాయి) వాటిలో ఎక్కువగా పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఉద్దేశించినవి. పాలస్తీనాలో అరబ్బులు, యూదులు, క్రైస్తవులు నివసించేవారు.
1917 నుండి 1948 వరకు పాలస్తీనా బ్రిటిష్ పాలనలో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో యూదుల మద్దతు కోసం వారికి ప్రత్యేక రాజ్యం ఇస్తామని బ్రిటన్ చెప్పింది. యూదులకు ప్రత్యేక దేశ కోరిక బలపడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 2 ఏప్రిల్ 1947 న బ్రిటన్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సభ 29 నవంబర్ 1947న 18 వ తీర్మానాన్ని ఆమోదించింది. పాలస్తీనాను 14 మే 1948 న ఇజ్రాయెల్ (యూదు), పాలస్తీనా (అరబ్) దేశాలుగా విభజించడం, జెరుసెలం నగరానికి అంతర్జాతీయ స్థాయి కల్పించడం ఆ తీర్మాన సారాంశం. దీన్ని అమెరికా, బ్రిటన్, సోవియట్ లు సమర్థించాయి.ఈ విభజనతో రెండు మత దేశాలు ఏర్పడతాయని నెహ్రూ దీన్ని వ్యతిరేకించారు.ఈ తీర్మానం యూదులకు మోదాన్ని, అరబ్బులకు, పాలస్తీనియన్లకు ఖేదాన్ని కలిగించింది. యూదు ప్రజామండలి నాయకుడు డేవిడ్ బెన్ గురియన్ 14 మే 1948న ఇజ్రాయెల్ స్థాపనను ప్రకటించారు.

14 మే 1948 నుండి 1967 వరకు పాలస్తీనా భాగాలైన వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరుసెలంలను జోర్డాన్, గాజాను ఈజిప్టు పాలించాయి. ఐరాస నిర్ణయానికి మించి 20% ఎక్కువ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. క్రమేపీ 80% పాలస్తీనాను దురాక్రమించింది. 1949 ఎన్నికల్లో సనాతన యూదు మతవాద పార్టీల మద్దతుతో బెన్ గురియన్ తిరిగి ప్రధాని అయ్యారు. పాలస్తీనాను ఇజ్రాయెల్ గుర్తించలేదు. ఇజ్రాయెల్ మిత్ర దేశాల్లో ఐరాసను నియంత్రించే అమెరికా ప్రధానమైంది.
పాలస్తీనా శరణార్థులకు సాయపడాలని 19 నవంబర్ 1948 ఐరాస తీర్మానం 212 నిర్ణయించింది. 5 లక్షల మంది శరణార్థుల బతుకు ముఖ్యం. సభ్యదేశాల చందాలతో వీరికి 3.2 కోట్ల డాలర్ల సహాయం అందించాలని తీర్మానించారు. 1967లో ఆక్రమిత పాలస్తీనాను ఇజ్రాయెల్ వదలాలని తీర్మానం 242 ఆదేశించింది. 11 డిసెంబర్ 1948 తీర్మానం 194 ప్రకారం జెరుసెలం పవిత్ర స్థలాలను రక్షించాలి, అందరినీ అనుమతించాలి. స్వస్థలాలకు పోవాలనుకున్న శరణార్థులకు సౌకర్యం కల్పించాలి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారి ఆస్తులకు పరిహారం చెల్లించాలి. పాలస్తీనా శరణార్థులకు సహాయాన్ని శీఘ్రతరం, తీవ్రతరం చేయడానికి ఫ్రాన్స్, టర్కీ, బ్రిటన్, ఉత్తర ఐర్లండ్, అమెరికాలకు బాధ్యత ఇస్తూ 8 డిసెంబర్ 1949 తీర్మానం 302(4) చేయబడింది.

9 డిసెంబర్ 1949 న జెరుసెలంకు అంతర్జాతీయ పాలనను తీర్మానం 303(4) ఏర్పాటు చేసింది. 10 డిసెంబర్ 1949 న జెరుసెలంకు ఆర్థిక వనరులు చేకూర్చాలని తీర్మానం 356లో పేర్కొన్నారు. పాలస్తీనా సహాయ తీర్మానాలను పూర్తి చేయాలని, 30 జూన్ 1952 నాటికి మరో 3 కోట్ల డాలర్లు ఇవ్వాలని 2 డిసెంబర్ 1950 తీర్మానం 393 ఆదేశించింది. అరబ్-, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు జరపాలని, పాలస్తీనా శరణార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలని 14 డిసెంబర్ 1950 తీర్మానం 394(4) చెప్పింది. 14 డిసెంబర్ 1950న జెరుసెలంకు అందిస్తామన్న 4,96,41,773 డాలర్ల సాయాన్ని 80 లక్షల డాలర్లు తగ్గించి, మరలా 28,79,000 డాలర్లు పెంచి సహాయాన్ని 4,45,20,773 కోట్ల డాలర్లుగా తీర్మానం 468 చేసింది.
పాలస్తీనా శరణార్థుల సహాయ పర్యవేక్షణకు 1952లో 4, 1953 లో 3, 1954 లో 2, 1955 లో 2, 1956 లో 1, 1957 లో 3, 1958 లో 1, 1959 లో 1, 1960 లో 5, 1962 లో 2, 1963 లో 4, 1965 లో 4, 1966 లో 2 తీర్మానాలను చేశారు. 1967 యుద్ధంలో మానవీయ సహాయానికి 1, జెరుసెలం స్థాయి తగ్గింపును ఖండిస్తూ 1, తీర్మానాలను ఇజ్రాయెల్ అమలు చేయనందుకు విచారం ప్రకటిస్తూ 1,

మధ్యప్రాచ్యంలో అధ్వాన పరిస్థితిని ప్రస్తావిస్తూ 2, పాలస్తీనా శరణార్థులను ఆదుకొమ్మని 2, పాలస్తీనా ప్రజల మానవ హక్కుల ఉల్లంఘనను ఖండిస్తూ 1968లో 7, ఐరాస ఆదేశాలను పాటించమని 1970లో 7, శరణార్థుల మానవ హక్కుల రక్షణకు, కిక్కిరిసిన శరణార్థి శిబిరాలకు ప్రజలను తరలించవద్దని 1971లో 5, శరణార్థులకు ఆర్థిక సహాయాన్ని ఆపినందుకు, మానవత్వాన్ని మరిచినందుకు 1972 లో 5, ఇజ్రాయెల్ మానవ హక్కుల తిరస్కరణపై 1973లో 4, ప్రకృతి వనరుల దోపిడీని ఆపుతూ, పాలస్తీనా గణతంత్ర రక్షణకు 1, 1974 లో పాలస్తీనా విమోచన సంస్థ (పిఎల్‌ఒ) ను ఐరాసకు ఆహ్వానిస్తూ 2, పిఎల్‌ఒ స్వయం నిర్ణయ శక్తి, హక్కును గుర్తిస్తూ 3, అణచివేత నిరోధానికి సాయుధ ప్రతి క్రియను సమర్థిస్తూ, ఈ హక్కుకు మద్దతివ్వని ప్రభుత్వాలను విమర్శిస్తూ 3, ఆక్రమిత ప్రాంతాల్లో సహజ వనరులపై పాలస్తీనాకు హక్కు కల్పిస్తూ 1, 1975లో శాంతి, పాలస్తీనా హక్కుల రక్షణలో పి.ఎల్.ఒ.తో చర్చించాలని 3, 1967 యుద్ధం తర్వాత ఆక్రమించిన పాలస్తీనా భూభాగాలను తిరిగి ఇవ్వమని 2, పాలస్తీనా సార్వభౌమత్వం,

మానవ హక్కుల గుర్తింపుకు 2, 1976 లో పాలస్తీనా స్వతంత్రత, సార్వభౌమత్వం, మానవ హక్కుల రక్షణకు 6, 1977 లో పాలస్తీనా భూభాగాలను ఖాళీ చేయమని 4, జెనోవ యుద్ధ ఒప్పందాలను గౌరవించి శరణార్థ శిశువులను రక్షించాలని, పాలస్తీనీయుల ఆస్తులను వారికి అప్పజెప్పాలని 4, 1978 లో ఇదే ఆదేశాలతో 7, 1979 లో అణు ఆయుధాలను ఉపసంహరించి, పాలస్తీనీయుల జీవించే హక్కును కాపాడాలని 9, 1980 లో అదే ఆదేశాలతో 7, 1981లో పురాతన ప్రాంత తవ్వకాలను ఇజ్రాయెల్ ఆపాలని, పాలస్తీనీయుల జీవన పరిస్థితులను మెరుగుపరచాలని, డెడ్- మధ్యధరా సముద్రాల మధ్య కాలువ తవ్వకాన్ని ఇజ్రాయెల్ ఆపాలని 8, 1982లో వెస్ట్ బ్యాంక్, గాజా, గోల్డన్ హైట్స్ ల ఇజ్రాయెల్ ఆక్రమణను, జెరుసెలంను కలుపుకోడాన్ని ఖండిస్తూ 10, 1983 లో ఇజ్రాయెల్ యుద్ధాలకు, ఆక్రమణలకు నిరసనగా ఐరాస సభ్యదేశాలు దానితో దౌత్య సంబంధాలను తెంచుకోవాలని 8, 1984 లో ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీనా భాగాలలో అభివృద్ధి పథకాలు చేపట్టాలని 7, 1985 లో 7, 1986 లో మానవ హక్కుల రక్షణకు 4, శాంతి రక్షణకు 1987 లో 5, 1988 లో 9 తీర్మానాలను చేశారు. 2004 లో ఇజ్రాయెల్ పాలస్తీనా ఆక్రమణను ఐరాస ధ్రువీకరించింది.

2012 లో పాలస్తీనాకు ఐరాసలో సభ్యరహిత పరిశీలిత స్థాయినిచ్చారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల్లో పాలస్తీనా సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించారు. 23 డిసెంబర్ 2016 -2334 తీర్మానం పాలస్తీనా, తూర్పు జెరుసెలంలలో ఇజ్రాయెల్ ఆక్రమణలు చట్ట వ్యతిరేకమని ఉద్ఘాటించింది. 2017లో ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసెలంను అమెరికా గుర్తింపును ఖండించారు. 2018లో గాజా సరిహద్దు నిరసనలకు ఇజ్రాయెల్ ప్రతిస్పందనను విమర్శించారు. 27 అక్టోబర్ 2023 న గాజాపై ఇజ్రాయెల్ దాడిని వెంటనే ఆపాలని, గాజాకు ఆహారం, మందుల సరఫరాను అడ్డుకోరాదని ఐరాస సర్వసభ్య సభ ఇయస్ 10-21 తీర్మానాన్ని ఆమోదించింది. మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను సమర్థించింది. తీర్మానంలో ఓటేయలేదు. ఈ వైఖరి తీసుకున్న తొలి భారత ప్రభుత్వం మోడీదే. పాలస్తీనాలో యూదులపై ఇజ్రాయెల్ హింసను, ఆయుధాల ప్రయోగాలను, వెస్ట్ బ్యాంక్, గాజాలలో ఇజ్రాయెల్ ఆక్రమణలను, బీరట్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ, పాలస్తీనా, ఈజిప్టు, ఇరాక్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా, ట్రాన్స్జోర్డాన్, యెమెన్‌లలో యుద్ధ విరమణ, జెరుసెలం పవిత్ర స్థలాల భద్రత, పాలస్తీనా శరణార్థుల సంక్షేమం, మానవ హక్కులను, పాలస్తీనా స్వతంత్రతను, సార్వభౌమత్వాన్ని గుర్తించమని, ఐరాస తీర్మానాలను పాటించమని కోరుతూ భద్రత మండలి 187 తీర్మానాలను చేసింది.

ఐరాస భద్రత మండలిలో చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా శాశ్వత సభ్య, అణ్వస్త్ర ఆయుధ దేశాలు. వీటికి భద్రత మండలిలో వీటో (రద్దు/నిషేధ) హక్కు ఉంది. ఈ దేశాల్లో ఏ దేశం తిరస్కరించినా భద్రత మండలిలో తీర్మానం వీగిపోతుంది. 16 ఫిబ్రవరి 1946 నుండి అనేక తీర్మానాలు వీటో చేయబడ్డాయి. వీటోకు గురైన పాలస్తీనా తీర్మానాలు: 22 జనవరి 1954 న ఇజ్రాయెల్- సిరియా యుద్ధ విరమణ తీర్మానాన్ని సోవియట్ వీటో చేసింది. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఆయుధాలను ఇవ్వరాదన్న తీర్మానాన్ని ఈజిప్టు అశ్రద్ధ చేయడాన్ని 29 మార్చి 1954 న సోవియట్ వీటో చేసింది. పాలస్తీనా సమస్యపై 29 అక్టోబర్ 1956 అమెరికా ప్రతిపాదనను 30 అక్టోబర్ 1956 న ఫ్రాన్స్, బ్రిటన్‌లు వీటో చేశాయి. ఇజ్రాయెల్ -పాలస్తీనాల మధ్య 6 రోజుల యుద్ధంలో తాను ఆక్రమించిన పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ వాపసు చేయాలన్న తీర్మానాన్ని 26 జులై 1973 న, లెబనాన్‌పై ఇజ్రాయెల్ సంఘర్షణను ఆపాలన్న తీర్మానాన్ని 08 డిసెంబర్ 1975 న, తాను ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుండి ఇజ్రాయెల్ వాపసు రావాలన్న తీర్మానాన్ని 26 జనవరి 1976, 27/28.3.2001, 14/15.12.2001, 20.12.2002, 16.9.2003, 14.10.2003,

25.3.2004, 5.10.2004, 13.7.2006, 11.11.2006, 18.02.2011 లలో, ఇదే చర్య కోరుతూ లిబియా, పాకిస్తాన్‌ల తీర్మానాన్ని 25 మార్చి 1976 న, విడదీయరాని పాలస్తీనా ప్రజల రక్షణ తీర్మానాన్ని 29 జూన్ 1976 న, ఇదే హక్కుల తీర్మానాన్ని 30 ఏప్రిల్ 1980న, గోల్డాన్ హైట్స్ ఆక్రమణ నుండి ఇజ్రాయెల్ తొలగాలన్న తీర్మానాన్ని 20 జనవరి 1982న, జెరుసెలం ఆక్రమణ వ్యతిరేక తీర్మానాన్ని 20 ఏప్రిల్ 1982 న, 30 జనవరి 1986 న, లెబనాన్ పై ఇజ్రాయెల్ ఆక్రమణ వ్యతిరేక తీర్మానాన్ని 17 జనవరి 1986 న, 10 మే 1988 న, 14 డిసెంబర్ 1988 న, ఇజ్రాయెల్ ఆక్రమించిన అరబ్ ప్రాంతాల నుండి వైదొలగాలన్న తీర్మానాన్ని 17 మే 1995న, 7 మార్చి 1997 న, ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసెలం ప్రకటనను వ్యతిరేకిస్తూ 18 డిసెంబర్ 2017 న, గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా 1 జూన్ 2018 న, హమాస్ పాలిత గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేక తీర్మానానికి 18 అక్టోబర్ 2023 న, 25 అక్టోబర్ 2023 న, గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపి, గాజా ప్రజలకు ఆహారం, మందులు, ఇతర జీవితావసరాలను సరఫరా చేయాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా 27 అక్టోబర్ 2023 న అమెరికా వీటో చేసింది.

రాజు మొండివాడు, బలవంతుడు, దుర్మార్గుడు అయితే బలహీనుల కుత్తుకల కోత తప్పదు. అమెరికా ఐరాసను నియంత్రించినా కొన్ని వందల పాలస్తీనా అనుకూల తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అయితే అవి అమలుకా లేదు. అమెరికా సిగ్గు లేకుండా వీటో హక్కును తన అనుచర, ఆక్రమణ దేశాలకు అనుకూలంగా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ప్రయోగించింది. 2024 లోనూ మతవాద పాలకులే ఇండియా, అమెరికాలలో అధికారం చేపడితే జాతీయ, అంతర్జాతీయ సమాజం అధోగతి పాలవుతుంది. చారిత్రక వ్యక్తుల త్యాగాలను గుర్తు తెచ్చుకొని జనం వ్యవహరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News