Wednesday, January 22, 2025

మజ్లిస్‌కు కంచుకోట

- Advertisement -
- Advertisement -

(కె.శ్రవణ్ కుమార్/చార్మినార్)
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి పాతనగరం గత కొన్ని దశాబ్ధాలుగా కంచుకోటగా నిలిచింది. మేజార్టీ ప్రజలకుతోడు మైనార్టీ ప్రజల సహకారం లభిస్తుండటంతో తిరుగులేని శక్తిగా నిలుస్తుంది. ఒకవైపు రాజకీయాలు మరోవైపు అభివృద్ధిని రెండింటిన తరాజులో తూచుతూ ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. అన్నాతమ్ముడు జోడెడ్లలా పార్టీ బండీని ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా ముందుకు నడుపుతున్నారు. అదే పంథాను నేటికి కొనసాగిస్తున్నారు. మొదటి నుండి పార్టీ విధేయులకు, విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తారు. ఏపార్టీయైన మజ్లిస్‌తో ఢీకొనలేని విధంగా పార్టీని క్రిందిస్థాయి నుండి బలోపేతం చేశారు. అంతేకాకుండా ఆపార్టీ నాయకత్వంపై ప్రజలు, నేతలు, కార్యకర్తలలో అచంచలమైన విశ్వాసం నెలకొటం ఆపార్టీకి ఏయేటికాయేడు కలిసి వస్తుంది. కనుసైగలతో కదం తొక్కె కార్యకర్తలు, చెప్పిన పనిని తూచా శిరసావహించే సీనియర్లు ఇలా మజ్లిస్ ఉన్నతికి దోహపడుతున్నారు.

తిరుగుబాటు అంటే తెలియని నాయకత్వమే ఆపార్టీకి రక్షగా నిలుస్తుంది. అపూర్వమైన గెలుపు చేకూరుస్తుంది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో రాజకీయాలు ఆతరువాత అభివృద్ధిపైనే దృష్టి సారిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీఠ వేస్తున్నారు. మజ్లిస్ పార్టీ అన్నివర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి తేలికైన చిరునామాగా మారింది. దీంతో మజ్లిస్‌పార్టీ పాతబస్తీలో బలీయైమన శక్తిగా ఎదిగింది. తిరుగులేని నాయకత్వంతో ఏ ఎన్నికలనైనా అవలీలగా గెలిచి చూపిస్తుంది. అందుకే పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజక వర్గాలతోపాటు జీహెచ్‌ఎంసి డివిజన్లలో సైతం గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఎంత ఊదరగొట్టిన, ఎన్నితాయిలాలు చూపిన మెజార్టీ ప్రజలు మజ్లిస్‌పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. బడానేతలు, కేంద్ర మంత్రులు, సినీనటులు, ఎంతటి వారొచ్చి ఎన్నికల ప్రచారం చేసినా మజ్లిస్ ఎత్తుల ముందు వారి ఉపన్యాసం దిగదిడుపే అవుతుందంటే అతిశయోక్తికాదు. అంతేకాకుండా మజ్లిస్ గెలుపును శాసించే విధంగా మజ్లిస్ బచావో తహరీక్ (ఎంబిటి)పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది. మెజార్టీ ప్రజలైన మైనార్టీల ఓట్లను చీల్చలేకపోతుంది. దీంతో ఫలితాలు అందరూ ఊహించినట్లే మజ్లిస్ ఖాతాలో చేరుతున్నాయి.

మజ్లిస్‌తో ప్రభుత్వాలు మిత్రధర్మం…
పాతబస్తీ శాంతిభద్రతల విషయంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మజ్లిస్‌తో మిత్రపక్షంగా ఉండకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మజ్లిస్‌ను కలుపుకొని వెళ్ళాయి. ప్రస్తుత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మజ్లిస్‌తో కలిసి నడుస్తుంది. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలోనే ఉందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పలుమార్లు బహిరంగానే చెప్పిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మిత్రధర్మాన్ని మజ్లిస్ అభివృద్ధి పనులకు వాడుకొని పాతబస్తీలో వేల కోట్ల రూపాయల సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఆర్వోబీలు, ఆర్యూబీలు, రోడ్డు విస్తరణ, బస్తీదవాఖానాలు, షాదిముబారక్, కల్యాణ మండపాల నిర్మాణం,

ఆసరా పింఛన్లు, దళిత బంధు, బిసి బంధు, మైనార్టీ స్కాలర్‌షిప్స్, రుణాలు ఇలా ఎన్నో సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తున్నారు. పాతనగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు పాతబస్తీలోని బండ్లగూడ, హఫీజ్‌బాబానగర్, సలాల, నర్కిపూల్‌బాగ్, రియాసత్‌నగర్, అమాన్‌నగర్ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలు నిర్మించి వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యనిందిస్తున్నారు. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

సమస్యల విన్నపానికి దారుసలాం కేంద్రం…
పార్టీ కేంద్ర కార్యాలయం దారుసలాం అన్ని సమస్యల పరిష్కారానికి కేంద్రంగా నిలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అన్నివర్గాల ప్రజలు ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా తమ ప్రజా ప్రతినిధులకు వివరించుకోవచ్చు. ఇదే మజ్లిస్ పార్టీకి బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు దారుసలాంలో పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభలో మజ్లిస్ ఫ్లోర్‌లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలతోపాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేటర్లు హాజరై ప్రజల సమస్యను నేరుగా వింటారు. వెంటనే వారి సమస్యల పరిష్కారానికి తమ లెటర్‌హెడ్లపై సంబంధిత అధికారులకు లేఖలు ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News