దుబాయ్ : యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఫలితంగా వందలాదిమంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు సిద్ధమై రన్‌వే 30ఆర్‌పైకి చేరుకుంది. అదే సమయంలో దుబాయ్ నుంచి బెంగళూరు వెళ్లే మరో విమానం ఈకే-568 అదే రన్‌వేపై టేకాఫ్ కోసం వేగంగా దూసుకొస్తోంది. మరో వైపు నుంచి విమానం దూసుకొస్తుండడాన్ని గమనించిన ఏటీసీ వెంటనే హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌ను నిలిపివేసింది. దీంతో అది రన్‌వేకు 790 మీటర్ల దూరంలోకి వచ్చి ట్యాక్సీ లేన్‌లోకి వెళ్లిపోయింది.
ఫలితంగా రెండు విమానాలు ఢీకొనే ముప్పు తప్పింది. కాగా, అదే రన్‌వే నుంచి బెంగళూరు విమానం టేకాఫ్ కాగా, ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్ విమానం టేకాఫ్ అయింది. నిజానికి రెండు విమానాలు బయలుదేరే సమయాల మధ్య ఐదు నిమిషాల తేడా మాత్రమే ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బెంగళూరు వెళ్లే విమానానికి తొలుత టేకాఫ్‌కు అనుమతి లభించింది. అయితే, ఏటీసీ క్లియరెన్స్ లేనప్పటికీ షెడ్యూల్ సమయానికి హైదరాబాద్ విమానం టేకాఫ్‌కు సిద్ధ కావడంతోనే ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. దీనిపై యూఏఈకి చెందిన ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ విచారణ ప్రారంభించింది.