Thursday, December 26, 2024

వణికిన తైవాన్

- Advertisement -
- Advertisement -

తైవాన్ ద్వీపాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. అనేక భవనాలు నేల కూలాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ , వంతెనలే ఊగిపోయాయి. రాజధాని తైపీలో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఓ ఫ్లైఓవర్ కొన్ని నిమిషాల పాటు కంపించింది. దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఎక్కడికక్కడే ఆగిపోయారు. మరోచోట మెట్రో బ్రిడ్జి ఊగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తైవాన్ ద్వీపం మొత్తం భూకంప ప్రభావం కనిపించింది.స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. భూకంప కేంద్రం 15.9 కిమీ లోతున ఉన్నట్టు గుర్తించారు. గత పాతికేళ్లలో ఇదే పెద్ద భూకంపమని అధికారులు చెబుతున్నారు.

ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవగా, దాదాపు 800 మంది గాయపడ్డారు. మరో 50 మంది ఆచూకీ తెలియడం లేదు. భూ ప్రకంపనలకు దగ్గరలో తూర్పు కౌంటీ హుయాలియెన్‌లో భవనాలు ఊగిసలాడాయి. ప్రజలు పనుల కోసం, మరికొందరు స్కూళ్లకు వెళ్తున్న సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. దీంతో దక్షిణ జపాన్, ఫిలిప్పైన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరువాత ఉపసంహరించుకున్నారు. భవనాల్లో ఉన్న వారిని బయటకు నిచ్చెనల ద్వారా కిందకు దింపుతున్నారు. తైపీలో రవాణా సర్వీసులు కొన్ని పునరుద్ధరించినప్పటికీ సబ్‌వే సిస్టమ్ మూసివేశారు. హుయాలియెన్ నగరానికి సమీపంలో సొరంగ మార్గాల్లో ఇరుక్కున్నవారిని నిదానంగా బయటకు తీసుకువస్తున్నామని ఫైర్ అథారిటీస్ చెప్పారు.

నేషనల్ పార్కు లోని హోటల్‌కు వెళ్తున్న నాలుగు మినీ బస్సుల్లోని 50 మంది ప్రయాణికులతో సంబంధాలు తెగిపోయాయి. ఆ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న రైలు మార్గాన్ని గురువారం తిరిగి తెరుస్తారని తైవాన్ అధ్యక్షునిగా ఎన్నికైన లై చింగ్ తె చెప్పారు. ప్రధాన విమానాశ్రయంలో ఆరు ఎఫ్ 16 ఫైటర్ జెట్స్ స్వల్పంగా దెబ్బతిన్నాయని తైవాన్ ఎయిర్‌ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. తైవాన్ రైళ్లు తనిఖీల వల్ల ఆలస్యమైనా ఎలాంటి నష్టం జరగలేదని, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, తైవాన్ హైస్పీడ్ రైల్ ఆపరేటర్ చెప్పారు. భూకంపం తరువాత చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

సునామీ హెచ్చరికలు
తైవాన్ భూకంపంతో జపాన్ సహా ఫిలిప్పైన్ తదితర దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ లోని దీవులకు సుమారు 3 కిమీ మేర సముద్ర అలలు ఎగసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. దాదాపు 30 నిమిషాల తరువాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా, దీవుల తీరాలను తాకినట్టు జపాన్ పేర్కొంది. జపాన్ వాతావరణ సంస్థ భూకంప తీవ్రత 7.7 గా ఉందని పేర్కొంది. ఒకినావా దక్షిణ ప్రాంతంలో సునామీ అలలు తాకిడి స్పల్పంగా కనిపించిందని వివరించింది. ఫిలిప్పైన్స్‌లో అనేక ప్రావిన్స్‌ల్లో కోస్తా తీర వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. చైనాలో ఆగ్నేయ ఫుజియన్ ప్రావిన్స్‌లో ప్రకంపనలు కనిపించాయని, షాంగైలో కూడా భూప్రకంపనల ప్రభావం కనిపించిందని చైనాపేర్కొంది. 1999లో తైవాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 2400 మంది ప్రాణాలు కోల్పోయారు. 50,000 భవనాలు ధ్వంసం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News