ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఫిల్మ్ సిటీ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోరెగావ్‌లోని ప్రధాన సినీ నగరంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు హిందీ టీవీ సీరియల్ ‘గమ్ హై కిసీ కే ప్యార్ మే’ సెట్‌లో మంటలు చెలరేగాయి. తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌కు పరిమితమైన మంటలు అనంతరం ఫిల్మ్ సిటీలోని మిగతా సెట్లకు కూడా వ్యాపించాయి. దీంతో లెవల్ 3 అలర్ట్‌ను జారీ చేశారు. దట్టంగా అలముకున్న పొగలు చాలా దూరం వరకు కనిపించాయి. ఫిల్మ్ సిటీలోని సిబ్బంది భయాందోళన చెందారు.
అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. 12 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలు, ఒక వాటర్ ట్యాంకర్, మూడు ఆటోమేటిక్ టర్న్ టేబుల్స్ (ఏడబ్ల్యూటీటీ), ఒక క్విక్ రెస్పాన్స్ వాహనం, ఇతర అగ్నిమాపక దళ వాహనాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ముంబై ఫిల్మ్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.